గణాంకాలతో మార్కెట్ల తీరెటు? | Stock market news and views | Sakshi
Sakshi News home page

గణాంకాలతో మార్కెట్ల తీరెటు?

Feb 16 2026 4:44 AM | Updated on Feb 16 2026 4:44 AM

Stock market news and views

ఇప్పటికే రిటైల్‌ ద్రవ్యోల్బణం జోరు 

టోకు ధరలు, వాణిజ్య గణాంకాల దారెటు? 

కీలకం కానున్న తయారీ, సరీ్వసుల పీఎంఐ 

గత వారం షాకిచి్చన ఏఐ ఎఫెక్ట్‌ కొనసాగేనా? 

ఈ వారం దేశీ స్టాక్స్‌లో ట్రెండ్‌పై నిపుణులు..

దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే ఇటీవల ఆంత్రోపిక్, శాప్‌ ఏఐ టూల్స్‌ అమెరికా నుంచి ఆసియా వరకూ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్ల తీరెలా ఉండవచ్చంటూ నిపుణుల మధ్య చర్చలు అధికమయ్యాయి. వీటిమధ్య ఈ వారం ట్రెండ్‌పై పలు అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం..  

దేశీయంగా నేడు(16న) జనవరి నెల టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. 2025 నవంబర్‌లో 0.32 శాతం నీరసించినప్పటికీ డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ వార్షికంగా 0.83 శాతం బలపడింది. వెరసి గత మూడు నెలల్లో తొలిసారి పెరిగింది. ఏప్రిల్‌ తదుపరి వేగమందుకుంది. రిటైల్‌ ధరలు(సీపీఐ) 2.75 శాతం ఎగసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క వాణిజ్య గణాంకాలు సైతం వెలువడనున్నాయి. డిసెంబర్‌లో ఎగుమతులకంటే దిగుమతులు అధికమై వాణిజ్య లోటు 25 బిలియన్‌ డాలర్లకు చేరింది. నవంబర్‌లో ఇది 24.53 బిలియన్‌ డాలర్లుకాగా.. 2024 డిసెంబర్‌లో 20.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ బాటలో వారాంతాన ఫిబ్రవరి నెలకు తయారీ, సరీ్వసులు, కాంపోజిట్‌ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. 

విదేశీ అంశాలు 
ఫిబ్రవరి 17న యూఎస్‌ ఏడీపీ ఉపాధి గణాంకాలు, హౌసింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్, పారిశ్రామికోత్పత్తి వివరాలు విడుదలకానున్నాయి. అంతేకాకుండా ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్‌) సైతం వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను యథాతథంగా 3.5–3.75 శాతం వద్ద కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇవి 2022 తదుపరి కనిష్టంకాగా.. తద్వారా మూడు వరుస రేట్ల కోతకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. వీటితోపాటు వ్యక్తిగత వ్యయాల ఇండెక్స్, 2025 అక్టోబర్‌–డిసెంబర్‌ జీడీపీ ముందస్తు అంచనాలు సైతం విడుదలకానున్నాయి. 

పెట్టుబడుల ప్రవాహమెటు? 
→ ఆంత్రోపిక్, శాప్‌ విడుదల చేసిన ఏఐ టూల్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత సరీ్వసుల రంగంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్వహించే కొన్ని రకాల  ప్రాజెక్టులకు చెక్‌ పడటంతోపాటు.. సిబ్బందిపై సైతం భారీ సంఖ్యలో వేటు వేయవలసి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి ఆందోళనలుగా మారి ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి ఇతర రంగాలవైపు మళ్లవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీ కస్టమర్‌ ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోసహా కొన్ని వినియోగ ఆధారిత రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు.  

→ టారిఫ్‌ ఆందోళనలు ఉపశమిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, ఆర్‌బీఐ, ఫెడరల్‌ రిజర్వ్‌ భవిష్యత్‌ పాలసీ నిర్ణయాలపై అంచనాలు తదితర అంశాలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యూఎస్, భారత్‌లలో ద్రవ్యోల్బణం, జీడీపీ పురోగతి వంటి అంశాలు ఫెడ్, ఆర్‌బీఐ పరపతి విధానాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వెరసి వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

→ క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల ప్రభావంతో పలు రంగాల కౌంటర్లు యాక్టివ్‌గా కదులుతున్నట్లు నాయిర్‌ తెలియజేశారు. పటిష్ట ఫలితాలు, ఆర్డర్లు సాధించిన కౌంటర్లు బలపడుతుంటే.. నిరాశపరచిన స్టాక్స్‌ నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి మార్కెట్‌ భారీ ఆటుపోట్లలోనూ విభిన్న రంగాల కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నట్లు వివరించారు. 

→ గత వారాంతాన వెలువడిన ఆశావహ యూఎస్‌ ఉపాధి గణాంకాలు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు యోచనకు చెక్‌ పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తినట్లు మిశ్రా తెలియజేశారు.

ఇండెక్సులు అటా.. ఇటా?
గత వారం యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ ఆశలు కలి్పంచినప్పటికీ ఏఐ ఆందోళనలు అమ్మకాలకు దారి చూపాయి. వెరసి ఈ వారం సైతం ఇండెక్సులు బలహీనంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 

→ నిఫ్టీకి 25,200–25,100 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 26,000–26,100 పాయింట్లవరకూ బౌన్స్‌కావచ్చు. అయితే నిఫ్టీ 25,100 దిగువకు చేరితే 24,700వరకూ పతనంకావచ్చు. 

→ సెన్సెక్స్‌ తొలుత 82,450–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్‌ తీసుకునే వీలుంది. ఒకవేళ తదుపరి జోరందుకుంటే 84,500–85,000 వరకూ పుంజుకునే చాన్స్‌ ఉంది. అయితే నీరసిస్తే 82,000 పాయింట్ల దిగువన 80,500–80,000 స్థాయిలో మద్దతు కనిపించవచ్చు.

గత వారమిలా..
గత వారం(9–13) దేశీ స్టాక్‌ మార్కెట్లు ఐటీ రంగ కౌంటర్లలో భారీ అమ్మకాల కారణంగా డీలా పడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 954 పాయింట్లు(1.15 శాతం) క్షీణించి 82,627 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 223 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 25,471 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ సైతం 1.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ నెల 2–13 మధ్య నికరంగా రూ. 19,675 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. యూరప్‌సహా.. యూఎస్‌తోనూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే అంతకుముందు 2026 జనవరి(రూ. 35,962 కోట్లు), 2025 డిసెంబర్‌(రూ. 22,611 కోట్లు), నవంబర్‌(3,765 కోట్లు)లలో నికరంగా అమ్మకాలు చేపట్టిన 
సంగతి తెలిసిందే.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement