డిజిటల్‌ పారదర్శకతకు అంతర్జాతీయ కూటమి | Global technology leaders launch Trusted Tech Alliance | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పారదర్శకతకు అంతర్జాతీయ కూటమి

Feb 15 2026 5:00 AM | Updated on Feb 15 2026 5:00 AM

Global technology leaders launch Trusted Tech Alliance

ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థల నేతృత్వంలో ‘ట్రస్టెడ్‌ టెక్‌ అలయన్స్‌’ ఏర్పాటు  

భారత్‌ నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రాతినిథ్యం 

ఏఐ, క్లౌడ్, సెమీకండక్టర్లపై సమిష్టి దృష్టి  

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన 15 ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ‘ట్రస్టెడ్‌ టెక్‌ అలయన్స్‌ (టీటీఏ)’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. జర్మనీలో జరిగిన మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ అలయన్స్‌ను ప్రకటించాయి. 

డిజిటల్‌ వ్యవస్థకు ఆధారమైన కనెక్టివిటీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఈ విభాగాల్లో పారదర్శకత, భద్రత, గవర్నెన్స్‌కు సంబంధించిన ఉమ్మడి ప్రమాణాలు రూపొందించడమే ప్రధాన ఉద్దేశమని అలయన్స్‌ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అమెజాన్‌ వెబ్‌ సరీ్వసెస్, ఆంథ్రోపిక్, కసావా టెక్నాలజీస్, కోహిర్, ఎరిక్సన్, గూగుల్‌ క్లౌడ్, హాన్‌వా గ్రూప్, జియో ప్లాట్‌ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్‌స్కేల్, ఎన్‌టీటీ, రాపిడస్, సాబ్, సాప్‌ తదితర సంస్థలు ఈ అలయన్స్‌కు స్థాపక సభ్యులుగాఉన్నాయి. 

డిజిటల్‌ విశ్వసనీయతకు అంతర్జాతీయ కృషిప్రపంచ దేశాల మధ్య భౌగోళిక–రాజకీయ విభజన పెరుగుతున్న నేపథ్యంలో ‘ట్రస్టెడ్‌ టెక్‌ అలయన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో డిజిటల్‌ విశ్వసనీయతను బలోపేతం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 

కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు జాతీయ భద్రత, ఆర్థిక పోటీ సామర్థ్యాలతో మరింత అనుసంధానం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సప్లయిదారుల విషయంలో అధిక స్థాయి విశ్వసనీయత అవసరమని ప్రభుత్వాలు కంపెనీలు కోరుకుంటున్నాయని అలయన్స్‌ వెల్లడించింది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, ఉమ్మడి ఆపరేటింగ్‌ ప్రమాణాల ఆధారంగానే నమ్మకాన్ని నిర్మించవచ్చని చూపించేందుకే టీటీఏ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు పేర్కొంది. 

అయిదు నిర్దిష్ట సూత్రాలకు అంగీకారం 
అలయన్స్‌ సభ్య సంస్థలు ఐదు కీలక సూత్రాలకు అంగీకారం తెలిపాయి. 

(1). పారదర్శక కార్పొరేట్‌ పాలన, నైతిక ప్రవర్తన
(2). కార్యకలాపాల్లో స్పష్టత, సురక్షిత డెవలప్‌మెంట్, స్వతంత్ర అసెస్‌మెంట్‌ 
(3). బలమైన సప్లై చైన్, భద్రతా పర్యవేక్షణ 
(4). ఓపెన్, సహకారాత్మక, సమగ్ర, స్థిరమైన డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ 
(5). చట్టపాలనకు, డేటా పరిరక్షణకు గౌరవం. 
ఈ అయిదు సూత్రాల ప్రకారం టెక్నాలజీ అభివృద్ధి నుంచి వినియోగం వరకు ప్రతి దశలోనూ భద్రత అమలు చేయాల్సి ఉంటుంది.

అలయన్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ భాగస్వామ్యం
అలయన్స్‌లో భారతీయ సంస్థ 
జియో ప్లాట్‌ఫామ్స్‌ భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘డిజిటల్‌ ఇండియా’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాలకు అనుగుణంగా కనెక్టివిటీ, క్లౌడ్, సెమీకండక్టర్లు, ఏఐ వంటి కీలక రంగాల్లో గ్లోబల్‌ స్థాయి ఉమ్మడి ప్రమాణాల రూపకల్పనలో భారత్‌ పాత్రను ఇది మరింత బలోపేతం చేయనుంది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, పారదర్శకత–భద్రత ఆధారిత ప్రమాణాలే విశ్వాసానికి పునాది కావాలన్న దృక్పథం భారత్‌కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారనుందని జియో ప్లాట్‌ఫామ్స్‌ సీఈవో కిరణ్‌ థామస్‌  తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement