స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో పీట్ లౌ (Pete Lau)పై తైవాన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. చైనా టెక్ ఎగ్జిక్యూటివ్‌లపై తైవాన్ తీసుకున్న అత్యంత అరుదైన, కఠినమైన చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. ప్రధానంగా అక్రమ నియామకాలు, సాంకేతిక సమాచార లీకేజీపై తైవాన్ ప్రభుత్వం చేపట్టిన అణిచివేత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.
వివాదానికి ప్రధాన కారణం ఏంటి?
తైవాన్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండానే కొన్నేళ్లుగా తైవాన్‌కు చెందిన ఇంజినీర్లను అక్రమంగా నియమించుకుంది. ఈక్రమంలో తైవాన్, చైనా మధ్య వ్యాపార, ఉపాధి సంబంధాలను నియంత్రించే కఠినమైన చట్టాలను వన్ ప్లస్ ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 70 మందికి పైగా తైవాన్ ఇంజినీర్లను వన్ ప్లస్ చట్టవిరుద్ధంగా చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంజినీర్లు వన్ ప్లస్ పరికరాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, పరిశోధన విభాగాల్లో పనిచేశారని గుర్తించారు.
జాతీయ భద్రత, సాంకేతిక పరిరక్షణ
ఈ కేసు కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదని, ఇది తైవాన్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో తైవాన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. చైనా సంస్థలు ఇలాంటి నియామకాల ద్వారా తమ దేశ మేధో సంపత్తిని, క్లిష్టమైన సాంకేతికతను తస్కరించే ప్రమాదం ఉందని తైవాన్ ఆందోళన చెందుతోంది.
కంపెనీ స్పందన
ఈ పరిణామాలపై వన్ ప్లస్ స్పందిస్తూ.. తమ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సాగుతాయని, ఈ చట్టపరమైన అంశం కంపెనీ రోజువారీ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి చైనా-తైవాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా పీట్ లౌ అప్పగింత సాధ్యంకానప్పటికీ ఈ వారెంట్ కారణంగా టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షించినట్లయింది.
పీట్ లౌ ప్రస్థానం..
చైనాలో జన్మించిన పీట్ లౌ 2013లో వన్ ప్లస్ స్థాపించడానికి ముందు ఒప్పో (Oppo)లో సీనియర్ ఎగ్జిక్యూటవ్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తాను వన్ ప్లస్ సీఈవోగా ఉండటంతో పాటు, ఒప్పోలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీఓ)గా కూడా పని చేస్తున్నారు. తన నాయకత్వంలోనే వన్ ప్లస్ పెద్ద బ్రాండ్‌గా ఎదిగి ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మెరుగైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇదీ చదవండి: నిధులు మూరెడు.. పనులు జానెడు!


