నిధులు మూరెడు.. పనులు జానెడు! | Public money is not constraint in rural India People matters | Sakshi
Sakshi News home page

గ్రామీణ వ్యవసాయం.. నిధులు మూరెడు.. పనులు జానెడు!

Jan 16 2026 8:46 AM | Updated on Jan 16 2026 11:00 AM

Public money is not constraint in rural India People matters

భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథంలో అసలైన సవాలు నిధుల కొరత కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ నిధులను సమర్థంగా ఖర్చు చేస్తూ ఫలితాలుగా మార్చగల మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని విధానకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతర సాంకేతిక మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రొఫెషనల్‌ వ్యక్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అంకెల్లో నిధుల వెల్లువ

ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే గ్రామీణ ఉపాధికి నిధుల కొరత లేదన్నది స్పష్టమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ (2024-25)కు సుమారు రూ.1.32 లక్షల కోట్లు కేటాయించారు. ఎంజీనరెగా(‍ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ)కు రూ.86,000 కోట్లు ఇచ్చారు. ఒడిశా వంటి రాష్ట్రాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే రూ.33,919 కోట్లు కేటాయించాయి. ఇంత భారీ పెట్టుబడులు పెడుతున్నా సమీక్షలు కేవలం ‘ఎంత మందికి లబ్ధి చేకూరింది? ఎన్ని ఎరువులు పంచారు?’ అనే గణాంకాలకే పరిమితమవుతున్నాయి. కానీ, ఆ పెట్టుబడుల వల్ల పంటల ఉత్పాదకత పెరిగిందా? రైతుల కుటుంబ ఆదాయం మెరుగుపడిందా? అన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.

పరిష్కారమేంటి?

ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండటంతో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచే వ్యవస్థ అవసరం. దీనికోసం జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన స్థానిక యువత పరిష్కారంగా తోస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

వీరి విధులు - బాధ్యతలు

  • తమ సొంత గ్రామంలోనే ఉంటూ వాతావరణానుకూల సాగు, పశువైద్యం, నీటి నిర్వహణలో రైతులకు మార్గనిర్దేశం చేస్తారు.

  • శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాల నుంచి సర్వీసు ఫీజులు పొందవచ్చు.

  • పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పథకాల అమలును పర్యవేక్షిస్తారు.

తక్కువ ఖర్చు - ఎక్కువ లాభం

శిక్షణలో పూర్తి చేసిన ఒక్కో వ్యక్తికి డిజిటల్ కిట్ కోసం సుమారు రూ.1 లక్ష వెచ్చిస్తే, 10,000 మందిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది వార్షిక వ్యవసాయ బడ్జెట్‌లో చాలా స్వల్ప భాగం. కానీ, ఈ చిన్న పెట్టుబడితో ప్రతి గ్రామంలో ఒక నిరంతర పర్యవేక్షణ, మద్దతు వ్యవస్థ ఏర్పడి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వృథా కాకుండా సరైన ఫలితాలను ఇస్తాయి.

తూర్పు ఆఫ్రికాలో కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, కొన్ని ఆసియా దేశాల్లోని ఫీల్డ్ ఫెసిలిటేటర్లు ఇలాంటి విధానంతోనే విజయాలు సాధించారు. భారతదేశంలో ఇప్పటికే ఉన్న కృషి సఖీలు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం కేడర్లను కేవలం ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా వారిని కీలక వనరులుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement