నవంబర్‌లో 56.6కు పీఎంఐ పరిమితం
అక్టోబర్‌లో ఇది 59.2 పాయింట్లు
9 నెలల కనిష్టానికి చేరిక
తయారీ రంగం పనితీరు నవంబర్‌లో కొంత బలహీనపడింది. తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరింది. తయారీ రంగం పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.6 పాయింట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లో ఇది 59.2 పాయింట్లుగా ఉండడం గమనార్హం. సాధారణంగా 50కు పైన నమోదైతే, విస్తరణగానే పరిగణిస్తుంటారు.
అమెరికా టారిఫ్‌లు తయారీ కార్యకలాపాల విస్తరణను నిదానించేలా చేసినట్టు నవంబర్ నెల పీఎంఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. అంతర్జాతీయంగా విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నప్పటికీ.. ఆఫ్రికా, ఆసియా, యూరప్, మధ్య ప్రాచ్యంలోని క్లయింట్లకు అమ్మకాల్లో వృద్ధి కొంత నిదానించినట్టు చెప్పారు. కొత్త ఎగుమతి ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి చేరినట్టు ప్రంజుల్ భండారీ తెలిపారు. వ్యాపార విశ్వాసం సైతం నవంబర్‌లో పడిపోయినట్టు చెప్పారు. టారిఫ్‌ల ప్రభావంపై పెరిగిన ఆందోళనలను తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
జీఎస్‌టీ కోత ఒక్కటీ చాలదు..
‘జీఎస్‌టీ రేట్ల కోత ప్రభావం క్రమంగా ఆవిరవుతోంది. డిమాండ్‌పై టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇది చాలకపోవచ్చు’ అని భండారీ అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో తయారీ వ్యయాలు, విక్రయ ధరలు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. తగ్గిన ఆర్డర్లకు అనుగుణంగా నియామకాలు, కొనుగోళ్ల ప్రణాళికలను సంస్థలు సవరించుకుంటున్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ రంగ పీఎంఐ సర్వేలో తెలిసింది. నియామకాలు 21 నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. వచ్చే 12 నెలల కాలానికి తయారీ ఉత్పత్తిని పెంచుకుంటామన్న విశ్వాసం కంపెనీల్లో కనపించడగా, సానుకూల సెంటిమెంట్ మాత్రం మూడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 400 తయారీ సంస్థలకు సంబంధించి పర్చేంజింగ్ మేనేజర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను హెచ్‌ఎస్‌బీసీ ఇండియా విడుదల చేస్తుంటుంది.
ఇదీ చదవండి: 13 నెలల కనిష్టానికి పారిశ్రామిక వృద్ధి


