మేకిన్‌ ఇండియాకు మెగా పుష్‌  | Center Approved 22 new proposals under its Electronics Components Manufacturing Scheme | Sakshi
Sakshi News home page

మేకిన్‌ ఇండియాకు మెగా పుష్‌ 

Jan 3 2026 5:13 AM | Updated on Jan 3 2026 5:19 AM

Center Approved 22 new proposals under its Electronics Components Manufacturing Scheme

‘ఎల్రక్టానిక్స్‌’ స్కీములో మరిన్ని ప్రాజెక్టులు 

22 ప్రతిపాదనలకు కేంద్రం క్లియరెన్స్‌ 

రూ. 41,683 కోట్ల పెట్టుబడులు; కొత్తగా 33,791 ఉద్యోగాలు 

లిస్టులో ఫాక్స్‌కాన్, డిక్సన్, టాటా, శాంసంగ్‌

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీని ప్రోత్సహించే దిశగా ప్రవేశపెట్టిన ఈసీజీఎస్‌ స్కీము కింద కొత్తగా 22 ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల కింద రూ. 41,863 కోట్ల పెట్టుబడులు రానుండగా రూ. 2,58,152 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను కంపెనీలు తయారు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ స్కీము (ఈసీజీఎస్‌) కింద ఆమోదించిన ప్రతిపాదనల్లో ఫాక్స్‌కాన్, డిక్సన్, టాటా ఎల్రక్టానిక్స్, శాంసంగ్‌ మొదలైన దిగ్గజ కంపెనీల ప్రాజెక్టులు ఉన్నాయి. 

ఈ స్కీము కింద ఆమోదం లభించిన ప్రాజెక్టుల జాబితాలో ఇది మూడోది. దీనితో కొత్తగా 33,791 ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, కీలకమైన ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు దిగుమతులపై ఆధారపడటం తగ్గనుండగా, దేశీయంగానే అత్యంత విలువైన ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలకు వీలవుతుంది. 

కొత్త పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో సింహభాగం వాటా అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌కి సంబంధించిన కొత్త వెండార్లదే ఉంటుంది. వీటిలో కొన్ని సంస్థలు, యాపిల్‌ ఉత్పత్తులను అంతర్జాతీయంగా కూడా సరఫరా చేయనున్నాయి. మదర్సన్‌ ఎలక్ట్రానిక్‌ కాంపొనెంట్స్, టాటా ఎల్రక్టానిక్స్, ఏటీఎల్‌ బ్యాటరీ టెక్నాలజీ ఇండియా, ఫాక్స్‌కాన్‌ (యుఝాన్‌ టెక్‌ ఇండియా), హిండాల్కో ఇండస్ట్రీస్‌ అనే అయిదు సంస్థలు యాపిల్‌కి వెండార్లుగా వ్యవహరిస్తున్నాయి.  

మరిన్ని విశేషాలు... 
→ తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర 8 రాష్ట్రాల్లో రానున్నాయి. ప్రాంతాలవారీగా పారిశ్రామిక వృద్ధి సమతూకంతో ఉండేలా చూసేందుకు, ఎల్రక్టానిక్స్‌ తయారీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.  

→ స్మార్ట్‌ఫోన్స్‌లాంటి వాటిల్లో ఉపయోగించే మొబైల్‌ ఎన్‌క్లోజర్స్‌ తయారు చేసే మూడు ప్రాజెక్టుల్లో అత్యధికంగా రూ. 27,166 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.  

→ కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్‌ కంట్రోల్స్, ఆటోమోటివ్‌ సిస్టంలు మొదలైన వాటిలో ఉపయోగించే పీసీబీల విభాగంలో తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా రూ. 7,377 కోట్ల పెట్టుబడులు రానుండగా, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌కి పవర్‌ బ్యాకప్‌గా పని చేసే లిథియం అయాన్‌ సెల్స్‌ ప్రాజెక్టుపై రూ. 2,922 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ రానుంది.  

→ తమిళనాడులో ఫాక్స్‌కాన్‌ (యుఝాన్‌ టెక్‌ ఇండియా) మొబైల్‌ ఫోన్‌ ఎన్‌క్లోజర్ల ప్రాజెక్టుతో అదనంగా 16,200 మందికి ఉపాధి లభించనుంది. ఇక అదే రాష్ట్రంలో టాటా ఎల్రక్టానిక్స్‌ తలపెట్టిన మొబైల్‌ ఫోన్‌ ఎన్‌క్లోజర్ల ప్రాజెక్టుతో మరో 1,500 మందికి ఉపాధి లభించనుంది. 

→ ఈ విడతలో మొబైల్స్, టెలికం, ఆటోమోటివ్, ఐటీ హార్డ్‌వేర్‌ మొదలైన 11 సెగ్మెంట్ల ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 

→ 2025 నవంబర్‌లో ప్రకటించిన విడతలో రూ. 7,172 కోట్ల పెట్టుబడులు, 11,808 ప్రత్యక్ష ఉద్యోగాలు కలి్పంచే 17 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.  

→ అక్టోబర్‌లో ప్రకటించిన తొలి విడతలో రూ. 5,532 కోట్ల విలువ చేసే ఏడు ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement