దేశీ పరిశ్రమను కాపాడుకునే చర్య
2028 ఏప్రిల్ వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను మూడేళ్ల కాలానికి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చైనా తదితర దేశాల నుంచి చౌకగా వస్తున్న స్టీల్ ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్య తీసుకుంది. 2025 ఏప్రిల్ నుంచి స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై 12 శాతం సుంకాన్ని 200 రోజుల పాటు అమల్లో ఉండేలా కేంద్రం ఆదేశాలు తీసుకొచ్చింది. ఇప్పుడు 2028 ఏప్రిల్ వరకు వీటిని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది.
మొదటి ఏడాది కాలం అంటే 2026 ఏప్రిల్ 20 వరకు 12 శాతం, తదుపరి ఏడాది పాటు 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం చొప్పున 2028 ఏప్రిల్ 20 వరకు సంకాలు అమలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్య దేశీ స్టీల్ పరిశ్రమలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, వినియోగదారులు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిరంతర సరఫరా కొనసాగించేందుకు ఉద్దేశించినదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ (జిందాల్ స్టీల్ చైర్మన్) తెలిపారు. చైనా, జపాన్, కొరియా, వియత్నాంలో మిగులు స్టీల్ ఉత్పాదకతను భారత మార్కెట్‌వైపు మళ్లించడం వల్ల దేశీ సామర్థ్య వినియోగానికి సమస్యలు ఏర్పడుతున్నట్టు, పెట్టుబడుల ప్రణాళిక, ఉపాధిపై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు.


