టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు  | PV dispatches rise 13percent to 4,49616 units in Jan 2026 | Sakshi
Sakshi News home page

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

Feb 15 2026 5:25 AM | Updated on Feb 15 2026 8:40 PM

PV dispatches rise 13percent to 4,49616 units in Jan 2026

జనవరిలో పీవీల టోకు అమ్మకాలు 13 శాతం అప్‌ 

4.49 లక్షలకు చేరిక 

సియామ్‌ గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్‌ తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. 

ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్‌లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. 

గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్‌ చెప్పారు.  

ఎగుమతులు జోరు 
మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్‌పోర్ట్స్‌ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement