అంతర్జాతీయంగా వృద్ధి తీరుతెన్నులు, వడ్డీ రేట్ల అంచనాలు, లిక్విడిటీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి షాక్‌లనైనా తట్టుకుంటూ, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలను ఒకే దాంట్లో మేళవించి అందించే హైబ్రిడ్ ఫండ్స్, మీ పోర్ట్‌ఫోలియోకి దన్నుగా నిలబడగలవు. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మార్కెట్లో ఎలాంటి పరిస్థితులెదురైనా దీర్ఘకాలిక ప్రణాళిక దెబ్బతినకుండా, ఇవి మీ ఆర్థిక ప్రణాళికకు వెన్నెముకగా నిలుస్తాయి.
శక్తివంతమైన ఫీచర్లు..
ఈ హైబ్రిడ్ ఫండ్స్‌లో పలు శక్తివంతమైన ఫీచర్లు ఉంటాయి. మొదటిది పరిశీలిస్తే, ఇందులోని ఈక్విటీ భాగం దీర్ఘకాలికంగా అధిక వృద్ధి, ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించగలుగుతుంది. అదే సమయంలో డెట్ భాగమనేది పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని, రాబడిని అందిస్తూనే పతనాల వేళ ఆదుకుంటుంది. ఇక రెండో అంశమేమిటంటే, ఇది ఎమోషనల్ ‘షాక్ అబ్జర్బర్’లాగా కూడా పని చేస్తుంది. ఫిక్సిడ్ ఇన్‌కం భాగమనేది మార్కెట్ భారీగా ఎగిసినప్పుడు ఉన్నప్పుడు ఈక్విటీల్లో అతిగా ఇన్వెస్ట్ చేయాలన్న అత్యుత్సాహాన్ని కాస్త నెమ్మదింపచేస్తుంది. మార్కెట్లు కరెక్షన్‌కి లోనైనప్పుడు పోర్ట్‌ఫోలియో మరీ పతనమైపోకుండా కాపాడుతుంది. పెట్టుబడులను కొనసాగించే శక్తినిస్తుంది.
మూడో విషయం చూస్తే.. నిర్వహణపరంగా ఇది చాలా సరళంగా, క్రమశిక్షణను పెంపొందించే విధంగా ఉంటుంది. వివిధ స్కీములవ్యాప్తంగా ఈక్విటీ, డెట్, క్యాష్ పొజిషన్లను చూసుకుంటూ ఉండాలంటే బోలెడంత సమయం, రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చాలా మటుకు ఇన్వెస్టర్లు తరచుగా పోర్ట్‌ఫోలియోను పరిస్థితికి తగ్గట్లు సత్వరం సరిచేసుకోలేరు. తీరా చేసే సరికి సమయం మించిపోతుంది. హైబ్రిడ్ ఫండ్స్ అలా జరగకుండా, పరిస్థితికి అనుగుణంగా పెట్టుబడులను వివిధ సాధనాలకు తగిన రీతిలో కేటాయించి రీబ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా ప్రాక్టికల్‌గా, సైకలాజికల్‌గా మీపై ఒత్తిడి తగ్గించే విధంగా ఉంటాయి. ఇవి చాలా సరళంగా ఉండటం వల్ల తప్పిదాలు, లావాదేవీల వ్యయాలు, ట్యాక్స్‌ల భారంలాంటివి తక్కువగా ఉంటాయి.
రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంపిక..
ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా ప్రతి త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను అన్వేíÙంచాల్సిన పని లేకుండా వివిధ రకాల రిస్కు సామర్థ్యాలున్నవారికి అనువైనవిగా హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. వీటిలో అంతర్గతంగా పలు రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మోస్తరు రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులతో పాటు స్థిరత్వం కూడా కోరుకునే వారి కోసం మధ్యేమార్గంగా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. ఒడిదుడుకులను ఎక్కువగా ఇష్టపడని వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఇక కాస్త ఎక్కువ రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారి కోసం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అయితే, దేన్ని ఎంచుకున్నా హైబ్రిడ్ ఫండ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇవి స్వల్పకాలిక ట్రేడింగ్ సాధనాలు కావు. దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో వీటిలో పెట్టుబడులను కొనసాగిస్తేనే సిసలైన ప్రయోజనాలు పొందవచ్చు. స్కీమ్ లక్ష్యం గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫండ్‌ని బట్టి ఈక్విటీ, డెట్‌లకు కేటాయింపుల్లో గణనీయంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఫండ్ మెథడాలజీని తెలుసుకుంటే మీ రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంచుకునేందుకు వీలుంటుంది. స్వల్పకాలికంగా నగదు అవసరాల కోసం హైబ్రిడ్ ఫండ్స్‌ను ఉపయోగించుకోవడం తప్పిదమవుతుంది.
మన ఆర్థిక లక్ష్యాలకు నిర్దిష్ట గడువు, నిర్దిష్ట నగదు అవసరాలు ఉంటాయి. కాబట్టి, స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాల మేళవింపుగా పోర్ట్‌ఫోలియో ఉంటే, మనం నిర్దేశించుకున్న లక్ష్యం గడువు నాటికి మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ, నిధులు చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా, హైబ్రిడ్ ఫండ్స్‌ని పెట్టుబడుల కేటాయింపులకు ఒకానొక మూలస్తంభంగా మార్చుకోవడం ద్వారా ఇన్వెస్టర్లు వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, సంక్షోభాలు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందనిగుర్తుంచుకోవాలి.
హ్యాపీ న్యూ ఇయర్!

ఇదీ చదవండి: మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు


