ఎస్‌బీఐ తన గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్‌బీఐ గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్‌లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.
బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్‌గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.
2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్‌నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.


