ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్‌ | Key Highlights from SBI Research report on indian economy | Sakshi
Sakshi News home page

ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్‌

Jan 21 2026 7:37 AM | Updated on Jan 21 2026 7:37 AM

Key Highlights from SBI Research report on indian economy

భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నాలుగేళ్లలో (2030 నాటికి) ఎగువ మధ్యాదాయ దేశంగా మారుతుందని, చైనా, ఇండోనేషియా సరసన చేరుతుందని ఎస్‌బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. అలాగే, 2028 కంటే ముందుగానే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది.

స్థూల తలసరి ఆదాయం ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను తక్కువ ఆదాయం, దిగువ మధ్యాదాయం, ఎగువ మధ్యాదాయం, అధిక ఆదాయంగా ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరిస్తుంటుంది. 1990లో 219 దేశాలను ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరించగా, ఇందులో 51 దేశాలు తక్కువ ఆదాయం, 56 దేశాలు దిగువ మధ్యస్థ ఆదాయం, 29 దేశాలను ఎగువ మధ్యాదాయం, 39 దేశాలను ఉన్నతాదాయ విభాగంలో చేర్చింది. 2024 డేటా ప్రకారం.. తక్కువ ఆదాయం విభాగంలో కేవలం 26 దేశాలే మిగిలాయి. 50 దేశాలు దిగువ మధ్యాదాయం, 54 దేశాలు ఎగువ మధ్యాదాయం, 87 దేశాలు అధిక ఆదాయం కిందకు వచ్చాయి. 60 సంవత్సరాల తర్వాత భారత్‌ 2007లో తక్కువ ఆదాయం నుంచి దిగువ మధ్యాదాయ దేశంగా మారినట్టు.. తలసరి స్థూల ఆదాయం 1962లో 90 డాలర్లుగా ఉంటే, 2007లో 910 డాలర్లకు చేరినట్టు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.  

రెండేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు..  

భారత్‌ స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుందని, తదుపరి 7 ఏళ్లకు (2014లో) 2 ట్రిలియన్‌ డాలర్లకు, 2021 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు, 2025లో 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్టు ఎస్‌బీఐ నివేదిక వివరించింది. వచ్చే రెండేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తొలి వెయ్యి డాలర్ల తలసరి ఆదాయానికి భారత్‌ 2009లో చేరుకుందని, తదుపరి పదేళ్లలో 2019 నాటికి ఇది 2,000 డాలర్లు పెరిగిందని, అనంతరం ఏడేళ్లకు 3,000 డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది.

‘వచ్చే నాలుగేళ్లలో 2030 నాటికి 4,000 డాలర్లకు తలసరి ఆదాయం వృద్ధి చెందుతుంది. తద్వారా ఎగువ మధ్యాదాయ దేశంగా చైనా, ఇండోనేషియా సరసన చేరుతుంది. ప్రస్తుతం ఉన్నతాదాయ దేశానికి ఉన్న పరిమితి 13,936 డాలర్ల స్థాయిని భారత్‌ 2047 నాటికి చేరుకోవాలంటే.. ఇక్కడి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. గత 23 ఏళ్ల కాలంలో (2001–2024) భారత్‌ తలసరి స్థూల ఆదాయం ఏటా 8.3 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. కనుక ఇకపై 7.5 శాతం వృద్ధి సాధ్యమే’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవేళ 2047 నాటికి ఉన్నతాదాయ దేశానికి పరిమితి 18,000 డాలర్లకు మారుతుందని భావించేట్టు అయితే.. భారత్‌ ఇక్కడి నుంచి ఏటా 8.9 శాతం చొప్పున వచ్చే 23 ఏళ్ల పాటు వృద్ధిని సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు గాను భారత్‌ సంస్కరణల పథాన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement