వజ్రాల కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొంటున్న గందరగోళానికి తెరదించుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘డైమండ్’ అనే పదాన్ని కేవలం సహజ సిద్ధంగా లభించే వజ్రాలకే ఉపయోగించాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మార్కెట్‌లో పారదర్శకతను పెంచేందుకు బీఐఎస్ తాజాగా IS 19469:2025 అనే కొత్త ప్రమాణాన్ని ఆమోదించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణమైన ISO 18323:2015 (జ్యువెల్లరీ: డైమండ్ పరిశ్రమలో వినియోగదారుల విశ్వాసం)కు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది.
కొత్త మార్గదర్శకాల్లోని అంశాలు
భూగర్భంలో సహజంగా ఏర్పడిన వజ్రాలను మాత్రమే ‘డైమండ్’గా పరిగణిస్తారు. విక్రేతలు వీటిని మరింత స్పష్టంగా చెప్పాలనుకుంటే ‘నేచురల్’, ‘రియల్’, ‘జెన్యూన్’ లేదా ‘ప్రీషస్’ వంటి విశేషణాలను జోడించవచ్చు. ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారుచేసే వజ్రాల విషయంలో విక్రేతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని విక్రయించేటప్పుడు కచ్చితంగా ‘laboratory-grown diamond’ లేదా ‘laboratory-created diamond’ అనే పూర్తి పదాలను వాడాలి. ఇకపై ల్యాబ్ వజ్రాల కోసం LGD, lab-grown, lab-diamond వంటి షార్ట్ కట్ పేర్లను వాడటం నిషిద్ధం.
ల్యాబ్ వజ్రాలను విక్రయించేటప్పుడు ‘నేచర్స్’, ‘ప్యూర్’, ‘ఎర్త్-ఫ్రెండ్లీ’ లేదా ‘కల్చర్డ్’ వంటి పదాలను ఉపయోగించకూడదని బీఐఎస్ ఆదేశించింది. కేవలం బ్రాండ్ పేరుతో వీటిని విక్రయించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.
పరిశ్రమ వర్గాల స్పందన
బీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాచురల్ డైమండ్ కౌన్సిల్ (NDC) స్వాగతించింది. ఎన్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ రిచా సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ కొత్త ప్రమాణాలు వినియోగదారులకు ఎంతో కాలంగా అవసరమైన స్పష్టతను ఇస్తాయి. సహజ వజ్రాల విశిష్టతను ఇవి కాపాడతాయి’ అని పేర్కొన్నారు. అటు జ్యువెల్లరీ వ్యాపారులు కూడా ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైమండ్ పదజాలంలో అయోమయం తొలగించడం వల్ల పరిశ్రమ మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..


