ఒమన్ పౌరసత్వం దరఖాస్తులు.. నిబంధనల్లో భారీ మార్పులు..! | Oman Ministry announced new regulations for Omani citizenship | Sakshi
Sakshi News home page

Oman citizenship: ఒమన్ పౌరసత్వం కావాలా?.. ఈ కఠిన నిబంధనలు పాటించాల్సిందే..!

Jan 7 2026 2:10 AM | Updated on Jan 7 2026 2:21 AM

Oman Ministry announced new regulations for Omani citizenship

అరబ్ దేశమైన ఒమన్ తమ దేశ పౌరసత్వ చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒమన్ పౌరసత్వంతో సహా జాతీయత చట్టంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యనిర్వాహక నిబంధనలను ప్రకటించింది. అక్కడి స్థానిక మంత్రివర్గ నిర్ణయించాక అధికారిక గెజిట్ విడుదల చేసింది.  ప్రవాస కుటుంబాలకు పౌరసత్వం నిబంధనల్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. కాగా.. అరబ్ దేశాల్లో కఠిన నిబంధనలు ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే.

‌పౌరసత్వం దరఖాస్తు నిబంధనలు..

జాతీయతకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత వ్యక్తి లేదా వారి సంరక్షకుడు మంత్రిత్వ శాఖ తయారుచేసిన ఫారమ్‌లను అంతర్గత వ్యవహారాల శాఖకు సమర్పించాలి. దరఖాస్తుదారు విదేశాలలో నివసిస్తుంటే ఒమన్ జాతీయతను గుర్తింపు కోసం దరఖాస్తులను ఒమన్ రాయబార కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజుల్లోపు అవసరమైన విధానాలను పూర్తి చేయాలి. అయితే, మంత్రిత్వ శాఖ వ్రాతపూర్వక అభ్యర్థనపై దీనిని పొడిగించవచ్చు. ఇది పాటించడంలో విఫలమైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఒమన్‌లో చట్టపరమైన నివాసం, పాస్‌పోర్ట్ డేటా, మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఏదైనా ఇతర మార్గాల ద్వారా నిరూపించాలి.

అంతేకాకుండా దరఖాస్తుదారులు నేర చరిత్ర లేని ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అరబిక్ భాషలో ప్రావీణ్యం, అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్వహించే వ్రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఒకసారి విఫలమైతే..మళ్లీ ఆరు నెలల తర్వాత పరీక్షను తిరిగి రాయవచ్చు.. కానీ నాలుగు సార్లకు మించి రాయడానికి వీల్లేదు. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి తాను సుల్తానేట్ పట్ల విధేయుడిగా ఉంటానని..దాని ప్రాథమిక చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తానని, మంచి పౌరుడిగా ఉంటానని ప్రాథమిక కోర్టులో ప్రమాణం చేయాలి. ఒమన్ పౌరసత్వం పొందిన ప్రతి వ్యక్తి వారి మైనర్ పిల్లలకు ఒమన్ పాస్‌పోర్ట్‌లు పొందడం కోసం ఆరు నెలల్లోపు మంత్రిత్వ శాఖను సందర్శించాలి.

ఒమన్కు తిరిగి రావాల్సిందే..

ఒమన్ పౌరసత్వం పొందిన వ్యక్తి వరుసగా 24 నెలలకు పైగా ఒమన్ వెలుపల నివసించకూడదు. ఎక్కువ కాలం ఉండాలనుకునే వారు కాల వ్యవధి ముగియడానికి మూడు నెలల ముందే విదేశాల్లో ఉండడానికి గల కారణాలు, వివరాలతో సహా దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తులను సమర్పించిన 60 రోజులలోపు మంత్రిత్వ శాఖ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ వ్యవధిలోపు ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే.. మీ అభ్యర్థన తిరస్కరించినట్లే. దరఖాస్తుదారు అనుమతించిన వ్యవధి ముగిసేలోపు ఒమన్‌కు తిరిగి రావాలి. పౌరసత్వం కోల్పోయిన వారు ఎవరైనా తమ పాస్‌పోర్ట్, ఐడీ కార్డు విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాలకు 90 రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. లేకుంటే, సంబంధిత అధికారులు, మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. పౌరసత్వం కోల్పోవడం, రద్దు చేయడం, ఉపసంహరణ కేసులను పరిశీలించడానికి మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో చర్యలు చేపడుతుంది.

పౌరసత్వ దరఖాస్తు రుసుములు..

  • ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు: 600 రియాల్స్

  • ఒమానీ మహిళ, విదేశీ భార్య, వితంతువు, విడాకులు తీసుకున్న వ్యక్తి లేదా బిడ్డ కోసం దరఖాస్తు: 300 రియాల్స్

  • పౌరసత్వం పునరుద్ధరణ లేదా వదులుకోవడం కోసం దరఖాస్తు: 200 రియాల్స్

సాధారణ షరతులు..

  • సమర్పించిన అన్ని పత్రాలు అరబిక్‌లో ఉండాలి.

  • ఒమానీ పౌరసత్వం లేదా పునరుద్ధరణ కోసం దరఖాస్తుదారులు అవసరమైన పరీక్షల కోసం (అరబిక్ లేదా ఇతర భాషలు) సంబంధిత విభాగం ముందు హాజరు కావాలి.

  • ఒమానీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మరో దేశ పౌరసత్వం మంజూరు అయినట్లు నిర్ధారించే పత్రాలతో పాటు శాఖకు సమర్పించి నిర్దేశించిన రుసుము చెల్లించాలి.

  • పౌరసత్వాన్ని వదులుకున్నా, రద్దయినా వారు ఎవరైనా తమ పౌరసత్వాన్ని పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సుల్తానేట్‌లో కనీసం రెండు సంవత్సరాల శాశ్వత నివాసం, ఇతర దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు రుజువులు సమర్పించాలి.

ఒమానీ వ్యక్తిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వం..

ఒమానీ వ్యక్తి భార్య అయిన విదేశీ మహిళ ఈ క్రింది షరతుల కింద ఒమానీ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

1. వివాహం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతితో జరిగి ఉండాలి (చట్టం ప్రకారం అవసరమైతే).

2. ఆమె వివాహం చేసుకుని తన భర్తతో సుల్తానేట్‌లో కనీసం 10 సంవత్సరాలు ఉండాలి.

3. ఆమెకు ఒమానీ భర్త ద్వారా సంతానం కలిగి ఉండాలి.

4. ఆమె ఎలాంటి అనైతిక నేరాలకు పాల్పడి ఉండకూడదు.

5. ఒమానీ మహిళను వివాహం చేసుకున్న విదేశీయుడు పౌరసత్వం పొందాలంటే, వివాహాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement