టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు.
ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.
నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.
నదీం ప్రపంచ రికార్డు
ఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.
మరో ప్రపంచ రికార్డు కూడా సమం
ఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు.


