అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ట్రంప్ అధిక పన్నుల ప్రభావంతో ఎగుమతులు లేక చాలా మంది ఉపాధి కోల్పోయారు. అంతే కాకుండా ఫీజులు కట్టలేక తమ పిల్లలను పాఠశాలలకు మాన్పించేస్తున్నారు.
తుంటరి ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. స్నేహ హస్తం అందిస్తూనే చేయి తీసేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతాయని అందరూ ఆశిస్తే దానికి భిన్నంగా జరిగింది. పాకిస్థాన్ అంశంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా నిలిచిన ట్రంప్ అనంతరం రష్యానుంచి చమురు కొనకూడదని భారత్‌కు ఆంక్షలు విధించారు. భారత్ ఆ మాటల్ని ఖాతరు చేయకపోవడంతో పన్నులు 50 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ట్రంప్ పన్నుల ఎఫెక్ట్ గుజరాత్ సూరత్‌లోని వజ్రాల కార్మికుల కుటుంబాలపై పడింది. టాక్సులు 50 శాతానికి చేరడంతో వాటి ధరలు పెరిగి అమెరికాకు ఎగుమతయ్యే జువెల్లర్స్ చాలా తగ్గాయి. దీంతో దానిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావంతో వారి పిల్లలు పాఠశాలలు మానేయ్యాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఈ శీతాకాల పార్లమెంటు సెషన్‌లో విద్యార్థులు స్కూల్ డ్రాపౌట్స్‌పై నివేదిక అందించారు. అందులో 2025-26 గుజరాత్‌లో పాఠశాల మానేసిన విద్యార్థుల సంఖ్య 2.4 లక్షలుగా ఉంది. గతేడాది 50,541తో పోలిస్తే దాదాపు నాలిగింతలు పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలే కాకుండా సూరత్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనూ దాదాపు 600కు పైగా విద్యార్థులు తమ చదువు మధ్యలో విద్యను ఆపేసినట్లు నివేదికలు తెలిపాయి.
ఇండియన్ డైమండ్ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్సన్ దినేశ్ నవదీయా మాట్లాడుతూ.. "గతంలో వజ్రాల కార్మికులు నెలకు రూ. 30 నుంచి 35 వేలు సంపాదించేవారు ప్రస్తుతం ఆ మెుత్తం దాదాపు రూ. 20వేలకు పడిపోయింది. దీంతో ఇంటి అద్దెలు , ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి పిల్లలను స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నారు" అని తెలిపారు.
ట్రంప్ పన్నుల ప్రభావం వజ్రాల పరిశ్రమపై అధికంగా పడిందని పేర్కొన్నారు. అధిక పన్నుల ప్రభావంతో 50వేల మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. ఎంతో మందికి వేతనాలు తగ్గాయన్నారు. కాగా భారత్ నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వజ్రాలలో దాదాపు 40 శాతం ఆ దేశానికే వెళతాయి.


