హజ్ యాత్రకు అనుమతులపై సౌదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు కేటగిరీలకు చెందిన వారిని హజ్ మంత్రిత్వ శాఖ అనర్హులుగా ప్రకటించింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంట్రీ నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారకి హజ్ యాత్రకు అనుమతి లేదని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైకల్యంతో బాధపడుతున్నవారు, అంటు వ్యాధులు, తీవ్రమైన క్యాన్సర్తో సహా 6 కేటగిరీల వారిని అనర్హులుగా ప్రకటించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇప్పటికే ఆంక్షలు ఉన్నప్పటికీ.. స్పష్టమైన సూచనలు జారీ చేయడం ఇదే మొదటిసారి.
తాజా నిబంధనల ప్రకారం డయాలసిస్ రోగులు, తీవ్రమైన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన కాలేయ వ్యాధి, వైకల్యంతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న రోగులు హజ్ యాత్రకు వెళ్లేందుకు అనుమతించేది లేదని సౌదీ ప్రభుత్వం తెలిపింది. అలాగే 28 వారాలు నిండిన గర్భిణీ స్త్రీలు కూడా అనర్హులేనని ప్రకటించింది.
15 లోపు బుకింగ్‌లు..
ప్రైవేట్ గ్రూపుల ద్వారా హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల 15 లోపు తమ బుకింగ్‌లను పూర్తి చేయాలని ఇండియన్ హజ్, ఉమ్రా గ్రూప్ అసోసియేషన్ తెలిపింది. హజ్ తీర్థయాత్రకు ఎంపికైన ప్రైవేట్ గ్రూపులు కేంద్ర ప్రభుత్వం నుంచి హజ్ లైసెన్స్ కలిగి ఉన్నాయో లేదో దరఖాస్తుదారులు నిర్ధారించుకోవాలని సూచించింది.


