ఒక్క రోజు వర్షం కురిస్తేనే ఎక్కడైనా సరే జనజీవనం స్తంభించిపోతుంది. అలాంటిది యూకేలో ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి వర్షాలు ఆగడం లేదు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 40 రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణ పశ్చిమ ఇంగ్లాండ్, తూర్పు స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కార్న్వాల్‌లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదవగా.. దేశవ్యాప్తంగా 26 వాతావరణ కేంద్రాలు ఈ వర్షాలతో సరికొత్త రికార్డులు సృష్టించాయి.
ఇక ఫిబ్రవరి 8వ తేదీ నాటికి యూకేలో సగటు వర్షపాతం 37 శాతంగా నమోదైంది. ఇంగ్లాండ్‌లో ఇది 59 శాతం, దక్షిణ ఇంగ్లాండ్‌లో అయితే ఏకంగా 72 శాతానికి చేరింది. అబెర్డీన్‌లో ఫిబ్రవరి సగటు 180 శాతం దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాలు ఎప్పుడు తగ్గొచ్చు?
వాతావరణ శాఖ డిప్యూటీ చీఫ్ స్టీవెన్ కీట్స్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ వారం చివరలో స్థిరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ మధ్య అట్లాంటిక్ నుంచి వచ్చే బలమైన గాలులు.. యూకేలోకి ప్రవేశించొచ్చు. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కీట్స్ హెచ్చరించారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి తొలివారాల్లో కాస్త ఎండ కనిపించినా.. మళ్లీ భారీ వర్షాల ముప్పు ఉండొచ్చని అన్నారు. ఇది ఇలానే కొనసాగితే వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.


