హెచ్‌1బీ వీసాలను రద్దు చేయాలి | US lawmaker introduces bill to end H1B visa program | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీ వీసాలను రద్దు చేయాలి

Feb 11 2026 3:35 AM | Updated on Feb 11 2026 7:40 AM

US lawmaker introduces bill to end H1B visa program

ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్‌ నేత గ్రెగ్‌ 

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: విదేశీ కార్మీకులకు చట్టపర ఉపాధి కర్మిస్తున్న హెచ్‌–1బీ వీసా కార్యక్రమాన్ని శాశ్వతంగా రద్దుచేయాలని కోరుతూ అధికార రిపబ్లికన్‌ పార్టీ నేత ఒకరు అమెరికా దిగువసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఒకవేళ చట్టంగా మారితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయుల కల శాశ్వతంగా చెదిరిపోవడం ఖాయం. ఫ్లోరిడా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్‌ జిల్లా నుంచి ఆరేళ్లుగా దిగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ నేత గ్రెగ్‌ స్టూబ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. స్థానికుల ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొడుతున్నారనే అర్థం స్ఫురించేలా ఈ బిల్లుకు ‘ఎండింగ్‌ ఎక్స్‌ప్లోటేటివ్‌ ఇంపోర్టెడ్‌ లేబర్‌ ఎగ్జెంప్షన్స్‌ (ఎక్సైల్‌) యాక్ట్‌’అని పేరుపెట్టారు.

‘‘అమెరికా చట్టాలను బడా కార్పొరేషన్లు అవహేళన చేస్తున్నాయి. తక్కువ వేతనాలకు దొరికే విదేశీ కార్మికులను అమెరికాలోకి దిగుమతి చేస్తున్నాయి. విదేశాల నుంచి కార్మీకులను దిగుమతి చేసుకునే ఈ సంస్కృతికి చరమగీతం పాడుదాం. హెచ్‌–1బీ వీసా కార్యక్రమం కారణంగా మన కార్మీకులు, యువతకు ఎలాంటి ఉపాధీ లభించట్లేదు. మన కార్మీక శక్తి ప్రయోజనాలను పణంగా పెట్టి బడా కార్పొరేషన్లు విదేశీయులకు ఉద్యోగాలిస్తున్నాయి. పౌరసత్వం లేని విదేశీయులకు లాభం చేకూరుస్తూ అమెరికన్ల కలలను కల్లలు చేస్తూంటే చూస్తూ ఊరుకోవద్దు. అందుకే ఎక్సైల్‌ బిల్లు తెచ్చా. ఈ మేరకు అమెరికాకు వలసలు, గుర్తింపు చట్టంలో మార్పులు తెద్దాం. ఇకనైనా అమెరికన్‌ కార్మికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి’’అని స్టూబ్‌ అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement