మూడు వాహనాలు ధ్వంసం, ఇద్దరికి గాయాలు
గెయిన్స్‌విల్లె: వాహనాల రద్దీ తీవ్రంగా ఉన్న సమయంలో ఓ సింగిల్ ఇంజిన్ విమానం రోడ్డుపై అత్యవసరంగా ల్యాండయ్యింది. అంత ట్రాఫిక్‌లోనూ కేవలం మూడు కార్లకు మాత్రమే ఆ విమానం తాకింది. ఆ వాహనాల్లోని ఇద్దరు మాత్రమే, అదీ స్వల్పంగా గాయపడ్డారు. విమానంలోని వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకుంది. హాకర్ బీచ్‌క్రాఫ్ట్ రకానికి చెందిన సింగిల్ ఇంజిన్ విమానం అట్లాంటాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గెయిన్స్‌విల్లెలోని బ్రౌన్స్ బ్రిడ్జి రోడ్డుపై అకస్మాత్తుగా దిగింది. ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో తిరిగి వెనక్కి వెళ్లాలని మొదట భావించాం.
అయితే, ఎంత దూరం వరకు ఇంజిన్ సక్రమంగా పనిచేస్తుందో తెలియదు. దీంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కనిపించిన రోడ్డుపైనే ల్యాండవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’అని పైలట్ థామస్ రోజెర్స్ చెప్పారు. ఘటనపై గెయిన్స్‌విల్లె పోలీస్ కెప్టెన్ కెవిన్ హోల్‌బ్రూక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘రోడ్డుపై ఆ సమయంలో వందల సంఖ్యలో వాహనాలున్నాయి. అయినప్పటికీ వాటి మధ్యలో విమానం ల్యాండవ్వడం, కేవలం మూడు వాహనాలను మాత్రమే ఢీకొట్టి, విద్యుత్ తీగలను తాకకుండా క్షేమంగా దిగడం అసాధారణమైన విషయం’ అని పేర్కొన్నారు. ఈశాన్య జార్జియాలోని అతి ప్రధానమైన రహదారిపై జరిగిన ఇలాంటి ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవ డం, చనిపోకపోవడం చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది’ అని ఆయన చెప్పారు.


