గత నెల 26న సీఎం చంద్రబాబు సమీక్షలో సెస్‌ల ప్రతిపాదన
ఒకసారి సెస్ విధించాక ఎన్నేళ్లయినా కొనసాగింపే
1,500 కి.మీ. అంతిమ వ్యయం రూ.15,326 కోట్లు
మరి కిలోమీటర్‌కు రూ.10 కోట్లు వ్యయం కాదా?
కాంట్రాక్టర్‌కు 15 ఏళ్లలో చెల్లింపు అని అంగీకారం
60 శాతం వడ్డీతో కలిపి ఆరు నెలలకోసారి చెల్లింపు
‘సాక్షి’ కథనానికి రహదారులు–భవనాల శాఖ వివరణ
సాక్షి, అమరావతి: ‘‘రోడ్డెక్కితే బాదుడే’’ అనేది ముమ్మాటికీ నిజమని తేలింది..! ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని స్పష్టమైంది..! రహదారుల–భవనాల శాఖ వివరణే దీనికి నిదర్శనంగా నిలిచింది...! హైబ్రిడ్ యాన్యుటీ (హెచ్‌టీ) పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో ప్రజల జేబులను గుల్లచేసేలా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన నిర్వాకాన్ని ఎండగడుతూ రోడ్డెక్కితే బాదుడే శీర్షికన ఆదివారం ‘సాక్షి’ కథనం ఇచి్చంది. దీనికి ఆర్‌అండ్‌బీ శాఖ వివరణ ఇచి్చంది. దీనికిముందు జరిగిన తతంగం చూస్తే, గత నెల 26న సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆర్‌అండ్‌బీ శాఖ సమీక్షలో ఏడాదికి పెట్రోల్, డీజిల్‌పై రూపాయి సెస్ ద్వారా రూ.732 కోట్లు, గనులు, ఖనిజాలపై 10 శాతం సెస్‌తో రూ.441 కోట్లు, మోటారు వాహనాల పన్నుపై 10 శాతం సెస్‌తో రూ.350 కోట్లు ఆదాయం వస్తుందని ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో రహదారి అభివృద్ధి కార్పొరేషన్... ఆరి్థక సంస్థల నుంచి అప్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
⇒ ఇక హైబ్రిడ్ యాన్యుటీలో కేంద్రం విధి విధానాల ప్రకారం టెండర్లు పిలుస్తామని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం లేదని, రెండు లేన్ల రహదారులు కాదని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది. కానీ, 2 లేన్లలోనే మూడు దశల్లో 1,500 కిలోమీటర్ల రోడ్లను హెచ్‌టీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి రూ.15,326 కోట్లు వ్యయం అవుతుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. అంటే, కిలోమీటర్‌కు రూ.10 కోట్లు కాదా?
⇒ మరోవైపు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని శాఖ వివరణ ఇచ్చింది. కానీ, సీఎం సమీక్షలో వారు ఇచ్చిన ప్రజంటేషన్‌లోని ప్రతిపాదనలే దీనికిఇ సాక్ష్యంగా నిలిచాయి. 1,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడానికి భూ సేకరణ, మౌలిక వసతులు (యుటిలిటీస్)కు రూ.4 వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుందని పేర్కొన్నారు. హెచ్‌టీ విధానంలో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం డెవలపర్ వ్యయం చేస్తారని రహదారులు–భవనాల శాఖ వివరణ ఇచి్చంది. ‘సాక్షి’ కూడా ఇదే చెప్పింది.
⇒ 16 ఏళ్లలో ఆరు నెలలకోసారి డెవలపర్‌కు అసలు, వడ్డీ చెల్లిస్తారని సాక్షి పేర్కొంటే 15 ఏళ్లు అని ఆర్‌అండ్‌బీ శాఖ వివరించింది. మొత్తం వ్యయం ప్రజల నుంచే గుంజడం అవాస్తవమని తెలిపింది. కానీ, సెస్‌ల కింద ఏటా రూ.1,636 కోట్లు, టోల్ వసూలుతో రూ.375 కోట్లు వస్తుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. ఈ లెక్కన 15 ఏళ్లలో రూ.24,540 కోట్లు, రూ.5,625 కోట్లు వసూలవడం వాస్తవం కాదా? ఈ రెండూ కలిపి రాష్ట్ర ప్రజలపై మొత్తం భారం రూ.30,165 కోట్లు కావడం లేదా? ఇక సెస్‌లను 16 ఏళ్లుగా సాక్షి పేర్కొంది. కానీ ఒకసారి సెస్ వేశాక అది ఎన్నేళ్లైనా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.
చంద్రబాబు మార్క్ బాదుడు
ఏడు రోడ్లు అభివృద్ధి చేసి టోల్ వసూలుకు నిర్ణయం
కన్సల్టెంట్‌కు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం హైవేలపైనే టోల్ వసూలు చేస్తే... చంద్రబాబు సర్కార్ మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని రెండు వరసల రోడ్లపై కూడా టోల్ బాదాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలి దశలో ప్రస్తుతం రెండు వరుసల్లో ఉన్న ఏడు రోడ్లను అభివృద్ధి చేసిన తర్వాత టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ ఏడు రోడ్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను కన్సల్టెంట్‌కు అప్పగించాలని నిర్ణయించింది.
470 కిలో మీటర్ల మేర ఏడు రోడ్లను రెండు వరసల్లో పటిష్టం చేసేందుకు గుర్తించారు. భూ సేకరణ అవసరం లేకుండా వాటిని 470 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.936 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత ఆ రహదారులపై టోల్ వసూలు ద్వారా ఏడాదికి రూ.96.03 కోట్లు రాబడి వస్తుందని, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మిగతా రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.


