టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 10) పాకిస్తాన్, యూఎస్‌ఏ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గత ఎడిషన్‌లో యూఎస్‌ఏ పాక్‌పై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్‌ఏ ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు కూడా పోటీనివ్వడం ఈ ప్రాధాన్యతను రెట్టింపు చేసింది.
యూఎస్‌ఏ ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నుంచే పాక్‌ను మరోసారి చిత్తు చేస్తామని సవాళ్లు చేశారు. ఇది కూడా ఓరకంగా ఈ మ్యాచ్‌కు హైప్ తెచ్చిపెట్టింది. యూఎస్‌ఏ జట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లతో పాటు పాక్ మూలాలున్న ఆటగాళ్లు (ఎహసాన్ ఆదిల్, మొహమ్మద్ మొహిసిన్) కూడా ఉన్నారు. వీరు కూడా పాక్ ఓడిస్తామని ఛాలెంజ్ చేయడం ఈ మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచింది.
కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ ప్రారంభంలో పాక్ తడబడింది. అయితే పాక్‌ను తొలుత ఇబ్బంది పెట్టింది మాత్రం పాక్ మూలాలున్న ఆటగాళ్లు కాని, భారత మూలాలున్న ఆటగాళ్లు కానీ కాదు.
షాడ్లే వాన్ ష్కాల్విక్ అనే సౌతాఫ్రికా మూలాలున్న ఆటగాడు. ఈ షాల్విక్ తొలి మ్యాచ్‌లో భారత్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ టీమిండియాపై 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఇప్పుడు ఇదే బౌలర్ పాక్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన సైమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా (1) వికెట్లు తీసిన షాల్విక్.. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్ ఝులిపిస్తున్న షాదాబ్ ఖాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (1) వికెట్లు తీశాడు. మొత్తంగా షాల్విక్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో పాక్ మూలాలున్న బౌలర్ మొహమ్మద్ మొహిసిన్ కూడా పాక్‌ను ఇబ్బంది పెట్టాడు. మొహిసిన్ పెద్దగా వికెట్లు తీయకపోయినా (4-0-27-1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో పాక్ మూలాలున్న పాక్ బౌలర్ ఎహసాన్ ఆదిల్ మాత్రం ధారాళంగా (3-0-29-0) పరుగులు సమర్పించుకున్నారు.
భారత మూలాలున్న బౌలర్లు సౌరభ్ నేత్రావల్కర్ (4-0-40-1), హర్మీత్ సింగ్ (4-0-41-1) కూడా బాగానే పరుగులు ఇచ్చారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజమ్ (30) పర్వాలేదనిపించాడు.


