బాలి: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్) కు ఇండోనేషియా తొలి దేశంగా సైనిక దళాలను పంపేందుకు సిద్ధమైంది.
గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెనక్కి తగ్గిన తర్వాత, అక్కడి భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ శాంతి దళాలను ఏర్పాటు చేయాలని అమెరికా మధ్యవర్తిత్వంతో నిర్ణయించారు. ఈ దళాలు స్థానిక ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ, శాంతి వాతావరణాన్ని కొనసాగించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా ఇప్పుడు గాజాకు సైనికులను పంపేందుకు ముందడుగు వేసింది. గతంలో యుఎఇ, ఈజిప్ట్, ఇటలీ, అజర్‌బైజాన్, పాకిస్తాన్, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా సహకారం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఏ దేశం కూడా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వేలాది మంది ఇండోనేషియా సైనికులు గాజా దక్షిణ ప్రాంతంలో ప్రవేశించి, IDF స్థానాన్ని భర్తీ చేయనున్నారు. వీరు శాంతి భద్రతా చర్యలు, శరణార్థుల సహాయం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయనున్నారు.
ఇండోనేషియా నిర్ణయంపై అంతర్జాతీయంగా సానుకూల వాతవారణం నెలకొంది. ఇండోయనేషియా నిర్ణయంతో గాజా ప్రజలకు శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇతర దేశాలు కూడా త్వరలో తమ దళాలను పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గాజాలో యుద్ధం తర్వాతి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ శాంతి దళాల ఏర్పాటులో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఇది కేవలం గాజా ప్రజలకు మాత్రమే కాకుండా, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కూడా ఒక కొత్త ఆశను కలిగిస్తోంది.


