
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం(ఇజ్రాయెల్) అమెరికా రక్షిత ప్రాంతం కాదని, ఎలాంటి ముప్పు ఎదురైనా ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కుంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అంటూ వ్యాఖ్యలు చేశారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందం పురోగతిపై చర్చించేందుకు బుధవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు సమావేశమయ్యారు. వాన్స్–నెతన్యాహు సమావేశంలో గాజా పరిస్థితి, హమాస్ కార్యకలాపాలు, యుద్ధానంతర పునరావాసం, అంతర్జాతీయ సాయంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో నెతన్యాహు మాట్లాడారు. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఉద్భవించే భద్రతా ముప్పులకు ఇజ్రాయెల్ సమాధానం చెప్పే అవకాశాలు తగ్గిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అని స్పష్టం చేశారు. గాజా యుద్ధం తరువాత భవిష్యత్తు పరిపాలనపై అంతర్జాతీయ వర్గాలు వివిధ ప్రతిపాదనలు చేస్తుండగా నెతన్యాహు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నెతన్యాహు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, అమెరికా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. హమాస్‌ను నిరాయుధీకరణ చేయడం, ఆ సంస్థ ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా చూసుకోవడం, గాజాను పునర్నిర్మించడం వంటి అంశాలు సులభం కావు. కానీ మేము ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
సమగ్ర పరిష్కారమే అవసరం
గాజా సంక్షోభం తగ్గించాలంటే రాజకీయ స్థాయిలో సమగ్ర పరిష్కారం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. హమాస్ నిరాయుధీకరణతో పాటు పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నెతన్యాహు, వాన్స్ సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో..ఇజ్రాయెల్ భద్రతా హక్కును అమెరికా గౌరవిస్తుంది. గాజాలో మానవతా సాయం అందించడంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. గాజా యుద్ధం తగ్గుముఖం పట్టినా, రాజకీయ స్థాయిలో ఒప్పందాలు సాఫీగా సాగకపోవడం అంతర్జాతీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు గాజా భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీశాయి.