
కొనుగోళ్లను భారత్ భారీగా తగ్గించడం ఖాయం
భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.
రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే...
ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ
‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్‌లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాం
వైట్‌హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్‌లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.
అదే మనకు దారిదీపం
వైట్‌హౌస్‌లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు.
మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.