రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను భారత్‌ ఆపేయబోతోంది: ట్రంప్‌ | Trump Again Claims India Will Soon Stop Buying Russian Oil | Sakshi
Sakshi News home page

రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను భారత్‌ ఆపేయబోతోంది: ట్రంప్‌

Oct 18 2025 7:41 AM | Updated on Oct 18 2025 9:27 AM

Trump Again Claims India Will Soon Stop Buying Russian Oil

రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్‌ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్‌ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో వైట్‌హౌజ్‌లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్‌ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్‌ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్‌ తాజాగా చెప్పారు. 

ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్‌ అన్నారు.

ఇదిలా ఉంటే.. భారత్‌  ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగిందని ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. 

భారత్‌ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్‌-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్వయంగా వెల్లడించారు కూడా. 

ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్‌లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్‌ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్‌పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. 

అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్‌ మరోసారి భారత్‌ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.

ఇదీ చదవండి: ట్రంప్‌ అయోమయావస్థ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement