
వాషింగ్టన్: భారత్ టార్గెట్‌గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్‌ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.
వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్‌కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.
White House Trade Adviser Peter Navarro on India:
"Nonsense that India needs Russian Oil"
"Profiteering by Indian refiners"
"India has Maharaja tariffs"
"Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025
భారత్‌కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.