పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఆరోపణ
లాహోర్: పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ధ్వజమెత్తారు.
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్‌కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్ ఉర్దూలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..
‘ఆసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్’ (ఇస్లామిక్ ఫైటర్) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్ ఆరోపించారు. డ్రోన్ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.
అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్ మొదట ఆఫ్ఘన్‌లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్ నుండి బహిష్కరించారు. డ్రోన్ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్ పేర్కొన్నారు. జనరల్ మునీర్‌ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు.
మునీర్ ఆదేశాలతోనే నిర్బంధం
మునీర్ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్‌లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు.


