ఐదంచెల భద్రతా వ్యవస్థ
పూర్తిగా ఏఐ ఆధారితమే
స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు
రష్యన్ పీఎస్‌ఎస్ సిబ్బంది
మన నేషనల్ గార్డ్ కమెండోలు
మోదీతో రాత్రి విందు భోజనం
రేపు రాష్ట్రపతిభవన్‌లో స్వాగతం
మహాత్ముని సమాధి వద్ద నివాళులు
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్‌తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్‌కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి!
ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు
→ పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు.
→ వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు.
→ పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఎస్‌జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు.
→ అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు!
→ పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు.
→ ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు.
→ కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి.
→ మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్‌ఎస్‌జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు.
→ మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి.
→ పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్‌ఎస్‌జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు.
→ పుతిన్ బస చేసే హోటల్‌ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు.
→ ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు.
బిజీ బిజీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్‌లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు.
అసలు హైలెట్ ఆ కారే!
ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్‌తో కలిసి విహరించడం విశేషం.
→ ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్‌లో చేర్చారు.
→ నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది.
→ ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్‌ను తయారు చేశారు.
రక్షణ మంత్రుల భేటీ నేడు
భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది.
అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్‌నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.


