సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు.

సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.

అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది.
ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.



