అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం | Sakshi Guest Column On India, Russia Relations | Sakshi
Sakshi News home page

అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం

Dec 4 2025 12:37 AM | Updated on Dec 4 2025 12:37 AM

Sakshi Guest Column On India, Russia Relations

మోదీతో పుతిన్‌ (ఫైల్‌). నేడు రష్యా అధ్యక్షుడి ఇండియా రాక.

విశ్లేషణ

ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్‌ యూనియన్‌ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్‌లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. 

రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ  ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. 

ఒకరికొకరు నిలబడి...
అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. 

ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. 

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్‌ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్‌ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్‌ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. 

స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!
సోవియట్‌ యూనియన్‌ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్‌తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్‌పై భారత్‌ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. 

దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్‌పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్‌ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్‌ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.

దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్‌ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్‌లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. 

పరస్పర రక్షణ
భారత్‌–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్‌ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్‌ నుంచి ఆర్కిటిక్‌ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్‌ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. 

భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్‌–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్‌ చాలా ఎక్కువగా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్‌ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. 

సు–57ఇ స్టెల్త్‌ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్‌–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్‌–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. 

అలాగే, కీలక ఖనిజాలు, రేర్‌ ఎర్త్‌ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్‌ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్‌–ఎర్త్‌ ప్రాసెసింగ్‌కు, పర్మనెంట్‌ మ్యాగ్నెట్‌ తయారీకి రంగం సిద్ధమవుతుంది. 

ఎలక్ట్రిక్‌ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్‌ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్‌ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. 

ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్‌ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో  అంతకన్నా ఇంకేం కావాలి!

జయంత రాయ్‌ చౌధురీ
వ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement