వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక.
మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్‌పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్‌బర్గ్‌లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు.
50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది.
భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్‌లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్‌త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి.
ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్‌లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్‌లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.
పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి.
మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి.
– జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు
(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)


