breaking news
International Day of Persons with Disabilities
-
వైకల్యాలకు చికిత్స అందాలి
అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారే ఈ లోకంలో మనుగడ సాగించడం కష్టమయ్యే ఈ రోజుల్లో ఏదైనా కారణాలవల్ల ఏదైనా అవయవం కోల్పోతే? ఎంతో కష్టమయ్యే ఆ జీవితాన్ని ఏదో విధంగా మళ్లీ నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు నిపుణులైన డాక్టర్లు. ఈ నెల (డిసెంబరు) 3న ప్రపంచ డిజ్ఎబిటిటీ డే (ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజ్‌ఎబిలిటీస్) సందర్భంగా దివ్యాంగుల వైకల్యాలను సరిదిద్దడంలో నిపుణులైన డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా అనేక వైకల్యాల గురించి అందించిన వివరాలు తెలుసుకుందాం.ప్రశ్న: వైకల్యాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాలు దాదాపుగా వందల రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది శారీరక వైకల్యాలూ (ఫిజికల్ / విజిబుల్ డిజ్‌ఎబిలిటీస్), రెండోది మానసిక వైకల్యాలు. వీటిని మెంటల్ ఇల్నెస్ / డిజ్ఎబిలిటీస్గా చెప్పవచ్చుగానీ ఆధునికమైన భాషలో అదంత నాగరికంగా ఉండకపోవచ్చు కాబట్టి సైకలాజికల్ / ఇన్విజిబుల్ అని చెప్పడమే ఔచిత్యంగా ఉంటుంది. వాటిని అధ్యయనం చేయడానికి, ఒక కేటగిరీలో ఉంచడం ద్వారా వైద్యం అందించడం సులభతరం చేయడానికి వాటిని ప్రధానంగా (బ్రాడ్‌గా) నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..1. భౌతికమైన వైకల్యాలు 2. ప్రవర్తనా పూర్వకమైనవి 3. అభివృద్ధి లోపించడం వల్ల కలిగినవి 4.జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. ప్రశ్న : కాస్త వాటిని విపులీకరిస్తారా? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : తప్పకుండా...⇒ మొదటగా ఫిజికల్ డిజ్ఎబిలిటీ: తలకు ఏదైనా దెబ్బతగిలి మెదడుకు గానీ, వెన్నుపూసకు గానీ గాయమైందనప్పుడు మెదడు కంట్రోల్ చేసే సెంటర్ తాలూకు అవయవానికీ లేదా వెన్నుపూస నుంచి వెళ్లే నరాల నుంచి ఆ అవయవానికి తగిన సిగ్నల్స్ అందక సదరు అవయవం చచ్చుబడవచ్చు. ఇందులో రోడ్డు ప్రమాదాలు వల్ల వచ్చిన వైకల్యాలూ ఉండవచ్చు. ⇒ రెండో రకం బిహేవియరల్ డిజ్‌ఎబిలిటీస్ అంటే... ప్రవర్తనలో లోపాలు. ఇవి చాలారకాలుగా ఉండవచ్చు. పిల్లల విషయానికి వస్తే... స్కూల్లో పిల్లల ప్రవర్తన అతిగా ఉండటం, ఇక పెద్దల విషయానికి వస్తే... సామాజికంగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవడం... దాంతో వ్యక్తిగత బంధాలూ, సంబంధాలూ దెబ్బతినడం జరుగుతాయి. ఉదాహరణకు పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (పిల్లలు కంట్రోల్ చేయలేనంత అతి చురుగ్గా ఉండటం) అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్ (పిల్లలు చాలా తిరుగుబాటుదనంగా వ్యవహరించడం) వంటివి. పెద్దల విషయానికి వస్తే యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ (ఓసీడీ) వంటివి ఉండవచ్చు. ఈ లోపాల్లో అంగవైకల్యాలు పెద్దగా ఉండవుగానీ మానసిక వైకల్యాలు ఉంటాయి.⇒మూడోది డెవలప్మెంటల్ డిజ్‌ఎబిలిటీస్: ఇందులో కొన్ని చిన్న చిన్న బాహ్య లక్షణాలు మినహాయించి పిల్లలు చూడటానికి అన్ని విధాలా అన్ని అవయవాలతో కనిపిస్తారు. కానీ వాళ్లలో ఏ వయసు తగినంతగా ఆ వయసుకు సరిపడిన వికాసం (మైల్‌స్టోన్స్) లేనందున ఇటు పిల్లలకూ, అటు వారి తల్లిదండ్రులకూ ఈ వైకల్యాలు ఎంతో బాధగా పరిణమిస్తాయి. ఉదాహరణకు ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్, సెరిబ్రల్ పాల్సీ, సరిగా మాట్లాడలేని / కమ్యూనికేట్ చేయలేని లాంగ్వేజ్ డిజార్డర్స్, డౌన్స్ సిండ్రోమ్... ఇలా వివరించుకుంటూపోతే ఒక్కోటీ ఒక పుస్తకమే రాసేంత సబ్జెక్టులు ఇవి. ⇒ నాలురో రకం వైకల్యాలను సెన్సరీ డిజ్ఎబిలిటీస్గా చెప్పవచ్చు. ఇవి జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. అంటే చూపు జ్ఞానం ఇచ్చే కళ్లకు ఏదైనా దెబ్బతగలడం వల్ల అంధత్వం, చెవులకు వచ్చే వినికిడి సమస్యలు... జ్వరం లేదా జలుబు వచ్చినప్పుడు తాత్కాలికంగా రుచి, వాసన తెలియకపోవడం (ఇది చాలా తాత్కాలికం). ఇలా మన జ్ఞానేంద్రియాలల్లో ఏదైనా అడ్డంకులు కలగడం వల్ల ఏర్పడే వీటికి సంబంధించిన చికిత్సలు అందించి సాధ్యమైనంతవరకు సెన్సరీ డిజ్ఎబిలిటీస్ను సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా మన వైకల్యాలను వర్గీకరించి, వాటికి అనుగుణంగా చికిత్సలు అందిస్తాం. ప్రశ్న : ఇప్పుడు ఎలాంటి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... మొదట భౌతిక వైకల్యాల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ సోకి... అది కాళ్లూ లేదా చేతుల ఎముకలకు పాకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సి వచ్చేది. అలా ఒక అవయవాన్ని తొలగించడాన్ని ‘యాంపుటేషన్’ అంటారు. దాంతో ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అయితే ఇప్పటి సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాలతో కాళ్లూ, చేతుల యాంపుటేషన్ చేయకుండా... వాటిని రక్షించేందుకు ‘లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్సల’తోనూ, ఆపైన ఫిజియోథెరపీలతో ఇలాంటి వారికీ వైకల్యం తగ్గేలా చూసేందుకు అవకాశముంది.ఇందులోనూ బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, లంగ్స్, కిడ్నీల మాదిరిగానే మృతిచెందిన వ్యక్తి దేహం నుంచి సేకరించిన ఎముకలను బాధితుడికి అమర్చే అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ; ఇక మృతుడి శరీరం నుంచి కాకుండా... కృత్రిమంగా, ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని/గురికాని లోహం (ఇనర్ట్ మెటల్)తో తయారైన ఎండో్రపోస్థెసిస్ ను అమర్చడం; ఇక బాధితుడి సొంత కణాలనే సేకరించి, వాటిని ‘ప్యూరిఫైడ్ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్ మాట్రిక్స్ మెటీరియల్’ లాంటి పదార్థాలతో బాధితుడు కోల్పోయిన అవే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేసే ‘టిష్యూ రీజనరేషన్’ వంటి అధునాతన ప్రక్రియలు ఉంటాయి. ప్రశ్న : మరి బిహేవియరల్ డిజ్ఎబిలిటీస్కు? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : ప్రధానంగా బిహేవియరల్ డిజ్ఎబిలిటీస్కు సైకియాట్రిస్టులు / రీహ్యాబిలిటేషన్ స్పెషలిస్టులు / క్లినికల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో బిహేవియర్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ప్రశ్న : డెవలప్మెంటల్ డిజ్‌ఎబిలిటీస్ గురించి వివరించండి. డాక్టర్ ప్రేమ్‌నాథ్ : డిజ్ఎబిటీస్లో అన్నిటికంటే ప్రధానమైనవి ఈ డెవలప్మెంటల్కు సంబంధించినవి. వీటిలో ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్ తీసుకుంటే ఇది ఇదమిత్థంగా ఎలా వస్తుందో తెలియదు. నిర్ణీతమైన చికిత్స ప్రక్రియలు ఉండవు. అంటే ప్రతి బిడ్డకూ ఒకేలాంటి చికిత్స కాకుండా వ్యక్తిగతమైన (పర్సనలైజ్డ్) చికిత్స అందించాల్సి వస్తుంది. ఇక సెన్సరీ డిజార్డర్స్‌లో కొన్నిటికి చికిత్స ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కంటిలో క్యాటరాక్ట్ వస్తే... దాన్ని చిన్న శస్త్రచికిత్సతో సరిదిద్ది మళ్లీ చూపు కనిపించేలా చేయవచ్చు. అలాగే వినికిడి కోసం కాక్లియర్ ఇం΄్లాంట్ అమర్చగానే సమస్య సరైపోతుంది. కొన్నిసార్లు హియరింగ్ ఎయిడ్స్తోనూ వినికిడి సమస్యను సమసిపోతుంది. ఇలా సెన్సోరియల్ డిజెబిలిటీస్లో చాలావరకు చికిత్స ఉంటుంది. కానీ డెవలప్మెంట్ డిజ్‌ఎబిలిటీస్ విషయంలో చాలా అనుభవం, నైపుణ్యం అవసరం.బిడ్డలోని లోపాన్నీ, లోపం తీవ్రతనూ, దాన్ని ఏ మేరకు మెరుగుపరచగలమనే అంశాన్ని బట్టి అనేక కోణాలలో చిన్నారి తాలూకు డిజ్ఎబిలిటీస్ను విశ్లేషించి చికిత్స అందించాలి. బిడ్డను చాలావరకు నార్మల్ చేయగలిగేలా, కనీసం తాను ఎవరికీ భారం కాకుండా తన పనులు తాను చేసుకోగలిగేలా తీర్చిదిద్దాలి. సరిగా మాట్లాడలేనివారికి స్పీచ్ థెరపీ ఇవ్వాలి. తన చేతులు సరిగా వాడగలిగేలా ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాలి. ఇలా రకరకాల పద్ధతుల్లో చికిత్స అందించాల్సి వస్తుంది. ప్రశ్న : మెడికల్ రిహాబిలిటేషన్ చికిత్సలో ప్రధానమైన విభాగాలు ఏమిటి? డాక్టర్ ప్రేమనాథ్ : స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ... ఇలా వాళ్ల రుగ్మతలను బట్టి, లోపాలూ, అవసరాలను బట్టి ఈ విభాగాల ద్వారా చికిత్స అందిస్తారు. ప్రశ్న : ఇప్పుడు డిజెబిలిటీ ఉన్న దాదాపు అందరికీ చికిత్స అందే పరిస్థితిగానీ, అవకాశాలుగానీ ఇప్పుడు ఉన్నాయా? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : దురదృష్టవశాత్తూ పూర్తిగా లేవనే చెప్పాలి. పెద్ద నగరాల్లో ఉండేవారికే ఈ వైకల్యాలపై తగినంత అవగాహన లేదు. మారుమూల పల్లెల్లోవాళ్ల సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు. ఇక మన దగ్గర ఆడపిల్ల అంటే ఉన్న వివక్ష ఉండనే ఉంది. ఉదాహరణకు ఆటిజమ్ మగ, ఆడపిల్లల్లో 2:1 నిష్పత్తిలో ఉంది. కానీ మన సమాజంలో ఆడపిల్లలకు జబ్బు ఉందంటే తాను ఎంతో వివక్షకు గురవుతుంది కాబట్టి వారిని చికిత్స కోసం తీసుకురారు. ఆటిజమ్ మొదలుకొని అన్నిరకాల వైకల్యాలలోనూ ఎంత త్వరగా చికిత్స కోసం తీసుకువస్తే అంత మంచిది.ఆటిజమ్ వంటి కొన్ని వైకల్యాల విషయంలో నిర్ణీతమైన చికిత్స లేకపోవడం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏమాత్రం పరిజ్ఞానమూ, అనుభవమూ, సరైన విద్యార్హతలు లేనివారు కూడా చికిత్స పేరిట పేరెంట్స్‌ను దోచుకుంటున్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరమైన ఈ వైకల్యాలకు చికిత్స అందించే విషయంలో శిక్షణపొందిన చికిత్సకుల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నేనూ, మాలాంటి కొందరు... తగిన శిక్షణ ద్వారా అలాంటి అనుభవజ్ఞులను అనేక మందిని తయారు చేసి వారిని సమాజానికి అందించడం అనే పని కూడా చేస్తున్నాం. అది మా బాధ్యత అని అనుకుంటున్నాం. – యాసీన్డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా, సీనియర్ న్యూరో రీ–హ్యాబిలిటేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ స్పీచ్ పాథాలజిస్ట్ -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్‌పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్‌లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్‌త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్‌లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్ పాల్గొన్నారు. -
వెదుళ్లపల్లిలో బ్రెయిలీ ప్రెస్ ప్రారంభం
బాపట్ల టౌన్ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి సమీపంలోని బధిరుల పాఠశాలలో బ్రెయిలీ ప్రెస్‌ను ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రూ.1.65 కోట్ల వ్యయంతో మిషనరీతోపాటు ప్రెస్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ముద్రించే పుస్తకాలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు అంధుల విద్యాసంస్థలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుంటూరులో త్వరలో రూ.1.35 కోట్లతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ ప్రెస్‌ను గుంటూరుకు మారుస్తామన్నారు. కార్యక్రమంలో బ్రెయిలీ లిపి ప్రాజెక్ట్ అధికారి డి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్‌బాబు, ఎంపీపీ మానం విజేత, మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోట నారాయణ, బదిరుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.అరుణ తదితరులున్నారు. -
విధిపై విజేత
నేడు అంతర్జాతీయ వికలాంగుల దినం విధి వైపరీత్యం జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఎదురొడ్డే ధైర్యం ఉంటే శారీరక వైకల్యాన్నే కాదు... పరిహసించిన విధినీ జయించవచ్చు. అక్షరాలా అదే నిరూపించింది మాలినీ భండారీ. అగ్ని ప్రమాదంతో అంగవైకల్యం బారిన పడ్డా... ఆత్మవిశ్వాసంతో కోలుకొని, అకుంఠిత దీక్షతో జీవితాన్ని దిద్దుకుంది. కర్నాటక రాష్ట్రంలో ఉడిపికి సమీపాన ఉన్న అంబలపూడిలో ‘సవిత సమాజ కో ఆపరేటివ్ బ్యాంకు’. అందులోని పలువురు ఉద్యోగుల మధ్య ఒక అమ్మాయి మీద అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఆమె అందరికి మల్లే కంప్యూటర్ మీద చాకచక్యంగా పని చేసుకుంటూ పోతోంది. అయితే, గమనిస్తే ఆమెకు చేతులు సరిగా లేవు. మణికట్టు వరకే ఉన్నాయి. బ్యాంకుకు వచ్చిన వాళ్లంతా ఆమె పట్ల కొంత సానుభూతితోనూ, మరికొందరు అత్యంత ఆసక్తిగానూ చూస్తున్నారు. మాలిని మాత్రం ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో పని చేసుకుపోతోంది. ఆమెకు చేతులు పుట్టుకతోనే లేవా, ప్రమాదంలో పోయాయా అనే ప్రశ్నలు వారి మెదళ్లలో. ఇంతకీ అసలేం జరిగిందంటే... మాలినిది ఉడిపికి దగ్గరలో కానాజర్ గ్రామం. ధర్మపాల, పుష్పవతి దంపతుల ఆరుగురు సంతానంలో షాలిని, మాలిని కవల పిల్లలు. ఏడాదిన్నర వయసులో ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా మాలిని పట్టు తప్పి, పక్కనే మండుతున్న గాడి పొయ్యిలో పడిపోయింది. తల్లితండ్రులు వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలను కాపాడగలిగారు. కానీ రెండు చేతులూ కాలిపోయాయి. తల్లితండ్రుల అజాగ్రత్తకు డాక్టరు నిర్లక్ష్యం కూడా తోడయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన డాక్టరు చేసిన పొరపాటు కారణంగా ఆమె అరచేతులు ఆకారాన్ని కోల్పోయి కాలిన మాంసపు ముద్దల్లా మారిపోయాయి. పుట్టుకతో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ విధి వైపరీత్యంతో చేతులను కోల్పోయింది మాలిని. ఈ పాపాయిని పెంచడం ఎలాగో తెలియని అయోమయం ఆ అమ్మానాన్నలది. ఎవరో ఇచ్చిన సలహా మేరకు కానాజర్ గ్రామంలోనే ఉన్న క్రైస్తవ మిషనరీ నిర్వహిస్తున్న లార్డ్స్ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో చేర్చారు. ఆమె అక్షరాలు ముత్యాలే! అంగవైకల్యం ఎంత బాధాకరమో అక్కడే తెలిసి వచ్చింది మాలినికి. తోటి పిల్లలతో సమానంగా అన్నింట్లో చురుగ్గా ఉంటోంది. కానీ పలక, బలపం పట్టుకోలేకపోతే అక్షరం వచ్చేదెలా? అక్షరాలు దిద్దుతున్న తోటి పిల్లల వైపు బెంగగా చూస్తూ కూర్చునేది. బహుశా దేవుడు తన పొరపాటును తానే సరిదిద్దుతాడు కాబోలు. విలియమ్ మాస్టారి రూపంలో మాలినికి సహాయం చేశాడు. పలకను ఒళ్లో పెట్టుకుని, రెండు మణికట్టుల మధ్య బలపాన్ని పెట్టుకుని రాయడం నేర్పించారాయన. ‘అలా తొలి అక్షరం రాసిన రోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంటూ మెరుస్తున్న కళ్లతో చెప్తుంది మాలిని. ఇక విలియం మాస్టార్ అయితే ‘మాలిని రాసిన అక్షరాలను చూసి చేతులు చక్కగా ఉన్న వాళ్లు సిగ్గు పడాల్సిందే’ అని మెచ్చుకుంటారు. ఇప్పుడామె బి.ఎ, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తోంది. గవర్నర్ నుంచి పురస్కారం! ఒక వైపు అంగ వైకల్యం, మరో వైపు పేదరికం. ఈ రెండింటినీ అధిగమించి జీవితంలో నిలబడిన ధీరోదాత్త బాలికగా 2004లో అప్పటి కర్నాటక గవర్నర్ టి.ఎన్. చతుర్వేది చేతుల మీదుగా పురస్కారాన్నీ, పదివేల రూపాయల నగదు బహుమతినీ అందుకున్నదా అమ్మాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితాన్ని నిలబెట్టుకోవడాన్ని ఆమెతో ప్రస్తావించినప్పుడు ‘‘అవసరం వచ్చినప్పుడు అన్నీ అవే వచ్చేస్తాయి’’ అని నవ్వుతూ బదులిస్తుంది మాలిని. ‘‘శారీరక వైకల్యాన్ని అధిగమించాలంటే ముందు మానసికంగా వైకల్యం లేకుండా చూసుకోవాలి. మనసు దిటవు చేసుకుంటే శారీరక వైకల్యాన్ని జయించవచ్చు’’ అని వికలాంగులకు ధైర్యం చెప్తుంటుంది. మాలిని ఎంతోమందికి ఆదర్శమవుతోంది అందుకే. -
వంద శాతం వైకల్యం ఉంటే రూ.వెయ్యి పింఛన్: కిరణ్‌కుమార్‌రెడ్డి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో సీఎం సాక్షి, హైదరాబాద్: నూరు శాతం వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వారికి ఇప్పటివరకు నెలకు రూ.500 ఇస్తున్న పింఛన్‌ను రూ.1000కి పెంచుతున్నామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడిం చారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రవుంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష వరకు రుణం ఇస్తామని చెప్పారు. పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు ఉపయుక్తంగా ఉండే విధంగా 3జీ ఫోన్లు అందుబాటులోనికి తెస్తామని, ఏఏవై కార్డులేని వికలాంగులందరికీ కార్డులు అందజేస్తామని, వడ్టీలేని రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. డిగ్రీలో ఫస్ట్‌క్లాస్ వచ్చిన విద్యార్థులు పీజీలో చేరితే వారికి మోటార్ సైకిళ్లు అందించే అంశాన్ని పరిశీలిస్తామని, స్వయం ఉపాధి పథకంలో భాగంగా వికలాం గుల కోసం త్వరలో మంచి పథకాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాము ఎవరికీ తక్కువ కాదన్న మనోధైర్యంతో వికలాంగులు ముందుకెళ్లేలా అండగా ఉంటామని చెప్పారు.


