నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారే ఈ లోకంలో మనుగడ సాగించడం కష్టమయ్యే ఈ రోజుల్లో ఏదైనా కారణాలవల్ల ఏదైనా అవయవం కోల్పోతే?
ఎంతో కష్టమయ్యే ఆ జీవితాన్ని ఏదో విధంగా మళ్లీ నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు నిపుణులైన డాక్టర్లు. ఈ నెల (డిసెంబరు) 3న ప్రపంచ డిజ్‌ఎబిటిటీ డే (ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజ్‌ఎబిలిటీస్) సందర్భంగా దివ్యాంగుల వైకల్యాలను సరిదిద్దడంలో నిపుణులైన డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా అనేక వైకల్యాల గురించి అందించిన వివరాలు తెలుసుకుందాం.
ప్రశ్న: వైకల్యాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు?
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాలు దాదాపుగా వందల రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది శారీరక వైకల్యాలూ (ఫిజికల్ / విజిబుల్ డిజ్‌ఎబిలిటీస్), రెండోది మానసిక వైకల్యాలు. వీటిని మెంటల్ ఇల్‌నెస్ / డిజ్‌ఎబిలిటీస్‌గా చెప్పవచ్చుగానీ ఆధునికమైన భాషలో అదంత నాగరికంగా ఉండకపోవచ్చు కాబట్టి సైకలాజికల్ / ఇన్‌విజిబుల్ అని చెప్పడమే ఔచిత్యంగా ఉంటుంది. వాటిని అధ్యయనం చేయడానికి, ఒక కేటగిరీలో ఉంచడం ద్వారా వైద్యం అందించడం సులభతరం చేయడానికి వాటిని ప్రధానంగా (బ్రాడ్‌గా) నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..1. భౌతికమైన వైకల్యాలు 2. ప్రవర్తనా పూర్వకమైనవి 3. అభివృద్ధి లోపించడం వల్ల కలిగినవి 4.జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి.
ప్రశ్న : కాస్త వాటిని విపులీకరిస్తారా?
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : తప్పకుండా...
⇒ మొదటగా ఫిజికల్ డిజ్‌ఎబిలిటీ: తలకు ఏదైనా దెబ్బతగిలి మెదడుకు గానీ, వెన్నుపూసకు గానీ గాయమైందనప్పుడు మెదడు కంట్రోల్ చేసే సెంటర్ తాలూకు అవయవానికీ లేదా వెన్నుపూస నుంచి వెళ్లే నరాల నుంచి ఆ అవయవానికి తగిన సిగ్నల్స్ అందక సదరు అవయవం చచ్చుబడవచ్చు. ఇందులో రోడ్డు ప్రమాదాలు వల్ల వచ్చిన వైకల్యాలూ ఉండవచ్చు.
⇒ రెండో రకం బిహేవియరల్ డిజ్‌ఎబిలిటీస్ అంటే... ప్రవర్తనలో లోపాలు. ఇవి చాలారకాలుగా ఉండవచ్చు. పిల్లల విషయానికి వస్తే... స్కూల్లో పిల్లల ప్రవర్తన అతిగా ఉండటం, ఇక పెద్దల విషయానికి వస్తే... సామాజికంగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవడం... దాంతో వ్యక్తిగత బంధాలూ, సంబంధాలూ దెబ్బతినడం జరుగుతాయి. ఉదాహరణకు పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (పిల్లలు కంట్రోల్ చేయలేనంత అతి చురుగ్గా ఉండటం) అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్ (పిల్లలు చాలా తిరుగుబాటుదనంగా వ్యవహరించడం) వంటివి. పెద్దల విషయానికి వస్తే యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ (ఓసీడీ) వంటివి ఉండవచ్చు. ఈ లోపాల్లో అంగవైకల్యాలు పెద్దగా ఉండవుగానీ మానసిక వైకల్యాలు ఉంటాయి.
⇒మూడోది డెవలప్‌మెంటల్ డిజ్‌ఎబిలిటీస్: ఇందులో కొన్ని చిన్న చిన్న బాహ్య లక్షణాలు మినహాయించి పిల్లలు చూడటానికి అన్ని విధాలా అన్ని అవయవాలతో కనిపిస్తారు. కానీ వాళ్లలో ఏ వయసు తగినంతగా ఆ వయసుకు సరిపడిన వికాసం (మైల్‌స్టోన్స్) లేనందున ఇటు పిల్లలకూ, అటు వారి తల్లిదండ్రులకూ ఈ వైకల్యాలు ఎంతో బాధగా పరిణమిస్తాయి. ఉదాహరణకు ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్, సెరిబ్రల్ పాల్సీ, సరిగా మాట్లాడలేని / కమ్యూనికేట్ చేయలేని లాంగ్వేజ్ డిజార్డర్స్, డౌన్స్ సిండ్రోమ్... ఇలా వివరించుకుంటూపోతే ఒక్కోటీ ఒక పుస్తకమే రాసేంత సబ్జెక్టులు ఇవి.
⇒ నాలురో రకం వైకల్యాలను సెన్సరీ డిజ్‌ఎబిలిటీస్‌గా చెప్పవచ్చు. ఇవి జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. అంటే చూపు జ్ఞానం ఇచ్చే కళ్లకు ఏదైనా దెబ్బతగలడం వల్ల అంధత్వం, చెవులకు వచ్చే వినికిడి సమస్యలు... జ్వరం లేదా జలుబు వచ్చినప్పుడు తాత్కాలికంగా రుచి, వాసన తెలియకపోవడం (ఇది చాలా తాత్కాలికం). ఇలా మన జ్ఞానేంద్రియాలల్లో ఏదైనా అడ్డంకులు కలగడం వల్ల ఏర్పడే వీటికి సంబంధించిన చికిత్సలు అందించి సాధ్యమైనంతవరకు సెన్సరీ డిజ్‌ఎబిలిటీస్‌ను సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా మన వైకల్యాలను వర్గీకరించి, వాటికి అనుగుణంగా చికిత్సలు అందిస్తాం.
ప్రశ్న : ఇప్పుడు ఎలాంటి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... మొదట భౌతిక వైకల్యాల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ సోకి... అది కాళ్లూ లేదా చేతుల ఎముకలకు పాకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సి వచ్చేది. అలా ఒక అవయవాన్ని తొలగించడాన్ని ‘యాంపుటేషన్’ అంటారు. దాంతో ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అయితే ఇప్పటి సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాలతో కాళ్లూ, చేతుల యాంపుటేషన్ చేయకుండా... వాటిని రక్షించేందుకు ‘లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్సల’తోనూ, ఆపైన ఫిజియోథెరపీలతో ఇలాంటి వారికీ వైకల్యం తగ్గేలా చూసేందుకు అవకాశముంది.
ఇందులోనూ బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, లంగ్స్, కిడ్నీల మాదిరిగానే మృతిచెందిన వ్యక్తి దేహం నుంచి సేకరించిన ఎముకలను బాధితుడికి అమర్చే అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్‌మెంట్ అనే ప్రక్రియ; ఇక మృతుడి శరీరం నుంచి కాకుండా... కృత్రిమంగా, ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని/గురికాని లోహం (ఇనర్ట్ మెటల్)తో తయారైన ఎండో్రపోస్థెసిస్ ను అమర్చడం; ఇక బాధితుడి సొంత కణాలనే సేకరించి, వాటిని ‘ప్యూరిఫైడ్‌ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్ మాట్రిక్స్ మెటీరియల్’ లాంటి పదార్థాలతో బాధితుడు కోల్పోయిన అవే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేసే ‘టిష్యూ రీజనరేషన్’ వంటి అధునాతన ప్రక్రియలు ఉంటాయి.
ప్రశ్న : మరి బిహేవియరల్ డిజ్‌ఎబిలిటీస్‌కు?
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : ప్రధానంగా బిహేవియరల్ డిజ్‌ఎబిలిటీస్‌కు సైకియాట్రిస్టులు / రీహ్యాబిలిటేషన్ స్పెషలిస్టులు / క్లినికల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో బిహేవియర్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు.
ప్రశ్న : డెవలప్‌మెంటల్ డిజ్‌ఎబిలిటీస్ గురించి వివరించండి.
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : డిజ్‌ఎబిటీస్‌లో అన్నిటికంటే ప్రధానమైనవి ఈ డెవలప్‌మెంటల్‌కు సంబంధించినవి. వీటిలో ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్ తీసుకుంటే ఇది ఇదమిత్థంగా ఎలా వస్తుందో తెలియదు. నిర్ణీతమైన చికిత్స ప్రక్రియలు ఉండవు. అంటే ప్రతి బిడ్డకూ ఒకేలాంటి చికిత్స కాకుండా వ్యక్తిగతమైన (పర్సనలైజ్‌డ్) చికిత్స అందించాల్సి వస్తుంది.
ఇక సెన్సరీ డిజార్డర్స్‌లో కొన్నిటికి చికిత్స ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కంటిలో క్యాటరాక్ట్ వస్తే... దాన్ని చిన్న శస్త్రచికిత్సతో సరిదిద్ది మళ్లీ చూపు కనిపించేలా చేయవచ్చు. అలాగే వినికిడి కోసం కాక్లియర్ ఇం΄్లాంట్ అమర్చగానే సమస్య సరైపోతుంది. కొన్నిసార్లు హియరింగ్ ఎయిడ్స్‌తోనూ వినికిడి సమస్యను సమసిపోతుంది. ఇలా సెన్సోరియల్ డిజెబిలిటీస్‌లో చాలావరకు చికిత్స ఉంటుంది. కానీ డెవలప్‌మెంట్ డిజ్‌ఎబిలిటీస్ విషయంలో చాలా అనుభవం, నైపుణ్యం అవసరం.
బిడ్డలోని లోపాన్నీ, లోపం తీవ్రతనూ, దాన్ని ఏ మేరకు మెరుగుపరచగలమనే అంశాన్ని బట్టి అనేక కోణాలలో చిన్నారి తాలూకు డిజ్‌ఎబిలిటీస్‌ను విశ్లేషించి చికిత్స అందించాలి. బిడ్డను చాలావరకు నార్మల్ చేయగలిగేలా, కనీసం తాను ఎవరికీ భారం కాకుండా తన పనులు తాను చేసుకోగలిగేలా తీర్చిదిద్దాలి. సరిగా మాట్లాడలేనివారికి స్పీచ్ థెరపీ ఇవ్వాలి. తన చేతులు సరిగా వాడగలిగేలా ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాలి. ఇలా రకరకాల పద్ధతుల్లో చికిత్స అందించాల్సి వస్తుంది.
ప్రశ్న : మెడికల్ రిహాబిలిటేషన్ చికిత్సలో ప్రధానమైన విభాగాలు ఏమిటి?
డాక్టర్ ప్రేమనాథ్ : స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ... ఇలా వాళ్ల రుగ్మతలను బట్టి, లోపాలూ, అవసరాలను బట్టి ఈ విభాగాల ద్వారా చికిత్స అందిస్తారు.
ప్రశ్న : ఇప్పుడు డిజెబిలిటీ ఉన్న దాదాపు అందరికీ చికిత్స అందే పరిస్థితిగానీ, అవకాశాలుగానీ ఇప్పుడు ఉన్నాయా?
డాక్టర్ ప్రేమ్‌నాథ్ : దురదృష్టవశాత్తూ పూర్తిగా లేవనే చెప్పాలి. పెద్ద నగరాల్లో ఉండేవారికే ఈ వైకల్యాలపై తగినంత అవగాహన లేదు. మారుమూల పల్లెల్లోవాళ్ల సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు. ఇక మన దగ్గర ఆడపిల్ల అంటే ఉన్న వివక్ష ఉండనే ఉంది. ఉదాహరణకు ఆటిజమ్ మగ, ఆడపిల్లల్లో 2:1 నిష్పత్తిలో ఉంది. కానీ మన సమాజంలో ఆడపిల్లలకు జబ్బు ఉందంటే తాను ఎంతో వివక్షకు గురవుతుంది కాబట్టి వారిని చికిత్స కోసం తీసుకురారు. ఆటిజమ్ మొదలుకొని అన్నిరకాల వైకల్యాలలోనూ ఎంత త్వరగా చికిత్స కోసం తీసుకువస్తే అంత మంచిది.
ఆటిజమ్ వంటి కొన్ని వైకల్యాల విషయంలో నిర్ణీతమైన చికిత్స లేకపోవడం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏమాత్రం పరిజ్ఞానమూ, అనుభవమూ, సరైన విద్యార్హతలు లేనివారు కూడా చికిత్స పేరిట పేరెంట్స్‌ను దోచుకుంటున్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరమైన ఈ వైకల్యాలకు చికిత్స అందించే విషయంలో శిక్షణపొందిన చికిత్సకుల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నేనూ, మాలాంటి కొందరు... తగిన శిక్షణ ద్వారా అలాంటి అనుభవజ్ఞులను అనేక మందిని తయారు చేసి వారిని సమాజానికి అందించడం అనే పని కూడా చేస్తున్నాం. అది మా బాధ్యత అని అనుకుంటున్నాం. – యాసీన్

డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా,
సీనియర్ న్యూరో రీ–హ్యాబిలిటేషన్
మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్
స్పీచ్ పాథాలజిస్ట్


