తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్‌లో మొట్టమొదటి సారిగా తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జి.రామాంజనేయ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మణిపాల్ ఫౌండేషన్, ముఖ్యమంత్రి సహాయనిధి సహకారంతో విజయనగరం జిల్లాకు చెందిన యువతి కె.సత్యవతికి పునర్జన్మ ప్రసాదించినట్లయిందని పేర్కొన్నారు.
కన్సల్టెంట్ సీటీవీఎస్ డాక్టర్ దిలీప్ రత్తి మాట్లాడుతూ.. సత్యవతి డైలేటెడ్ కార్డియో వయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతూ తమ ఆసుపత్రిలో చేరారని అన్నారు. హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకున్న ఆమెకు సమగ్ర ట్రాన్స్‌ప్లాంట్ ఈవేల్యూషన్ చేశామని పేర్కొన్నారు. ఐదేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్నాని.. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు మణిపాల్ వైద్య బృందానికి రుణపడి ఉంటానని సత్యవతి తెలిపారు. సమావేశంలో జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కె.రాంబాబు, డాక్టర్లు వరుణ్ పామిడి, శంకరరావు, అనిల్‌కుమార్, ఏవీఎస్‌ఎస్‌ఎన్ శ్రీధర్, ఎన్.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


