భార్య వైద్యానికి 600 కిలోమీటర్ల రిక్షా ప్రయాణం
ఆ రిక్షా చక్రాలు తిరుగుతుంటే.. ఒక పేదవాడి గుండె శబ్దం వినిపిస్తోంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు 70 ఏళ్ల వృద్ధాప్యం.. కానీ, తన వెనుక రిక్షాలో పక్షవాతంతో పడి ఉన్న భార్యను చూసినప్పుడు.. ఆ వృద్ధుని కాళ్లకు ఏనుగు బలం వచ్చేసింది. అంబులెన్స్ అద్దెకు తీసుకునేంత స్తోమత లేక, భార్య ప్రాణాలను కాపాడుకునేందుకు ఏకంగా 600 కిలోమీటర్ల రిక్షా యాత్ర చేసిన బాబు లోహర్ కథ ఇప్పుడు ప్రపంచాన్నే కదిలిస్తోంది.
తొమ్మిది రోజుల రిక్షా ప్రయాణం!
సంబల్‌పూర్‌లోని మోడిపాడకు చెందిన బాబు లోహర్ భార్య జ్యోతికి గతేడాది నవంబర్‌లో పక్షవాతం సోకింది. స్థానిక వైద్యులు ఆమెను కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాలకు తీసుకెళ్లాలని సూచించారు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. వాహనాన్ని అద్దెకు తీసుకునే శక్తి లేదు. కానీ, తన భార్యను చావుకు వదిలేయడం బాబు లోహర్‌కు ఇష్టం లేదు. తన ఏకైక ఆస్తి అయిన రిక్షాను బయటకు తీశాడు. పాత కుషన్లు వేసి భార్యను అందులో పడుకోబెట్టాడు. దైవ నామస్మరణ చేస్తూ సంబల్‌పూర్ నుంచి కటక్ వరకు 300 కిలోమీటర్లు రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు. తొమ్మిది రోజుల పాటు.. పగలు ప్రయాణం.. రాత్రి రోడ్డు పక్కన దుకాణాల ముందు బస.. ఇలా సాగింది బాబు లోహర్ రిక్షా ప్రయాణం.
రెండు నెలల చికిత్స.. రిక్షాలోనే తిరుగు ప్రయాణం
కటక్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వా త, జనవరి 19న భార్యతో కలిసి తిరిగి తన ఊరికి ప్రయాణమయ్యాడు. దారిలో ఒక ప్రమాదం జరిగి జ్యోతి కింద పడి తలకు గాయమైనా, బాబు లోహర్ గుండె ధైర్యాన్ని కోల్పోలేదు. స్థానిక ఆసుపత్రిలో బ్యాండేజ్ వేయించుకుని మళ్లీ రిక్షా ఎక్కాడు.
పోలీసుల సాయం వద్దన్న ‘ప్రేమ’మూర్తి
దారిలో టాంగీ పోలీస్ ఆఫీసర్ వికాస్ సేథి ఈ వృద్ధుని పరిస్థితిని చూసి చలించిపోయారు. ‘మీకు కారు ఏర్పాటు చేస్తాం.. సురక్షితంగా వెళ్ళండి’.. అని ప్రాధేయపడ్డారు. కానీ, బాబు లోహర్ ఆత్మాభిమానంతో సున్నితంగా తిరస్కరించాడు. ‘నా జీవితంలో నాకు ఇద్దరే ఇష్టమైన వారు ఉన్నారు. ఒకటి నా భార్య, రెండోది నా రిక్షా. ఈ ఇద్దరినీ నేను వదిలి ఉండలేను’.. అని సగర్వంగా చెప్పాడు. భార్య ప్రాణాలను సొంత రెక్కల కష్టంతో కాపాడుకుంటున్న ఆ వృద్ధుని ప్రేమ చూసి పోలీసులు నివ్వెరపోయారు. చివరికి భోజనం కోసం వారు ఇచ్చిన కొద్దిపాటి నగదును మాత్రం బలవంతం చేయడంతో బాబు లోహర్ స్వీకరించాడు. ప్రభుత్వ సౌకర్యాలు అందని చోట.. ఒక పేదవాడి ప్రేమ ఎలా కొండలను పిండి చేస్తుందో బాబు లోహర్ నిరూపించాడు. ఈ ప్రయాణం కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక అపురూప ప్రేమ కావ్యం..
– సాక్షి, నేషనల్ డెస్క్


