కంటి జబ్బులకు వినూత్న చికిత్స | Pandorum Technologies and Nucliian Join Hands to Provide innovative Treatment for Eye Diseases | Sakshi
Sakshi News home page

కంటి జబ్బులకు వినూత్న చికిత్స

Jan 6 2026 2:27 PM | Updated on Jan 6 2026 3:00 PM

Pandorum Technologies and Nucliian Join Hands to Provide innovative Treatment for Eye Diseases

హైదరాబాద్‌: ‍ప్రపంచ ఫార్మా రాజధాని హైదరాబాద్‌లో మరో వినూత్నమైన కంపెనీ అడుగుపెట్టింది. ఎక్సోసోమ్‌ల ఆధారంగా కణజాలాన్ని పునరుత్పత్తి చేయగల టెక్నాలజీ సాయంతో ఆసియా పసఫిక్‌ ప్రాంతం మొత్తానికి సరికొత్త కంటి చికిత్సలు అందించేందుకు పండోరమ్‌ టెక్నాలజీస్‌, హైదరాబాద్‌లోని నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌లు చేతులు కలిపాయి.

శరీర కణాలు స‍్రవించే అతిసూక్ష్మమైన భాగాలైన (30 నుంచి 150 నానోమీటర్లు) ఎక్సోసోమ్‌లు ప్రొటీన్లు, ఆర్‌ఎన్‌ఏ వంటివాటిని ఒక కణం నుంచి ఇంకో కణానికి మోసుకెళుతూంటాయి. వీటి స్థానంలో మందులను పంపిణీ చేయడం ద్వారా పాడైన కణాలను సరిచేయవచ్చునని అంచనా. ఈ దిశగా పండోరమ్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే కొంత ముందడుగు వేసింది.

కనుగుడ్డు (కార్నియా) దెబ్బతిన్న వారికి మళ్లీ చూపు రప్పించేందుకు కూడా తాము తయారు చేసిన ఎక్సోసోమ్‌ మందు ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పండోరమ్‌ టెక్నాలజీస్‌, భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ అయిన నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌ల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. పండోరమ్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఎక్సోసోమ్‌ మందును నూసిలియాన్‌ పెద్ద ఎత్తున తయారు చేస్తుంది. ఆసియా పసఫిక్‌ ప్రాంతం మొత్తానికి సరఫరా చేస్తుంది. దేశంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

‘‘పునరుత్పత్తి మందుల తయారీ విషయంలో పండోరమ్‌ ఇప్పటికే మేలి ముందడుగు వేసింది. పరిశోధనలు, వాణిజ్యాంశాల్లోనూ ప్రగతి సాధించాము. అడ్వాన్స్‌డ్‌ బయోలాజిక్స్‌ తయారీలో నైపుణ్యమున్న నూసిలియాన్‌తో చేతులు కలపడం ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ వినూత్నమైన చికిత్సను అందించవచ్చు’’ అని పండోరమ్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ తుహిన్‌ భౌమిక్‌ తెలిపారు.

నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ రఘు మలపాక మాట్లాడుతూ ‘‘కంటి జబ్బుల చికిత్స విషయంలో పండోరమ్‌ టెక్నాలజీస్‌ ఎక్సోసోమ్‌ ఆధారిత చికిత్స విప్లవాత్మకమైందని చెప్పాలి. బయలాజిక్స్‌ తయారీలో మాకున్న నైపుణ్యంతో ఎంతో మేలు చేకూరుతుంది’’ అని వివరించారు.

ప్రస్తుతం కంటి జబ్బులపై మాత్రమే దృష్టి పెడుతున్నామని, స్టీవెన్స్‌-జాన్సన్‌ సిండ్రోమ్‌, న్యూట్రోఫిక్‌ కెరటిటిస్‌ వంటి వాటికి త్వరలో చికిత్స అందించగలమని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో ఇదే ఎక్సోసోమ్‌ ఆధారిత టెక్నాలజీ సాయంతో వాపు కారణంగా చర్మం, ఊపిరితిత్తులు, ఫైబ్రోసిస్‌తోపాటు ఇతర అవయవాలకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపగలమని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement