సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త ఏడాది ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. జనవరిలో గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.2,917 కోట్ల విలువైన 4,686 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గత ఏడాది జనవరిలో 5,464 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.
గతేడాది జనవరితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 14 శాతం, అలాగే ప్రాపర్టీల విలువ 16 శాతం క్షీణించాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నెలవారి నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో ప్రాపర్టీల ధర సగటున ఒక శాతం పెరిగింది. జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధిక వాటా మేడ్చల్–మల్కాజిగిరిలో 46 శాతంగా ఉండగా.. ఆ తర్వాత రంగారెడ్డి 34 శాతం, హైదరాబాద్‌లో 19 శాతం, సంగారెడ్డి ఒక శాతం వాటాలతో ఉన్నాయి.
ఈ ఏడాది జనవరిలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న 684 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,294 కోట్లు. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 991 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి విలువ రూ.683 కోట్లుగా ఉంది. రూ.50 లక్షలలోపు ధర ఉన్న 3,011 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరగగా.. వీటి విలువ రూ.929 కోట్లుగా ఉంది.


