ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌కు అమెరికా పూర్తి ‍వ్యతిరేకం | US totally rejects global governance of AI | Sakshi
Sakshi News home page

ఏఐ గ్లోబల్‌ గవర్నెన్స్‌కు అమెరికా పూర్తి ‍వ్యతిరేకం

Feb 21 2026 9:46 AM | Updated on Feb 21 2026 11:30 AM

US totally rejects global governance of AI

కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.

కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదం

ప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్‌ గవర్నెన్స్‌లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.

ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement