దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్‌మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.
ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.
ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.
సింగపూర్‌లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.
ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు.


