మహిళా దినోత్సవ కథనాలు
మన మధ్యే మహాశక్తి
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.
ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు.ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు... మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు.కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.
సపోర్ట్ కాదు... క్లారిటీ కావాలి
జీవితపు చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు సేవలందిస్తూ, కుటుంబ జీవనాన్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది హైదరాబాద్ బోడుప్పల్‌లో ఉంటున్న మైరూన్. మరోచోట నర్సింగ్‌లో చేరితే అధిక డబ్బు వస్తుందని అయినవారు చెప్పినా తనకు సంతృప్తినిచ్చిన సేవనే ఎంచుకున్నానని వివరించింది. చంటిబిడ్డకు పాలిస్తూ, కరోనా సమయంలో రోగులకు సేవలందించింది. తెలంగాణలోని ఖమ్మంలో పుట్టి పెరిగిన మైరూన్ సేవాభావం గురించి మహిళాదినోత్సవం సందర్భంగా కథనం.
‘‘పాలియేటివ్ కేర్ అంటేనే చివరి స్టేజ్ కదా! వారికి పుండ్లు ఉంటాయి. నోటి నుంచి స్రావాలు బయటకు రావడం.. వంటివన్నీ ఉంటాయి. డెడ్ ఎండ్ స్టేజ్ కాబట్టి ఈ ఫీల్డ్‌కి రావడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, నాకు దీనిలోనే ఒక సంతృప్తి ఉంది. ఇదే నన్ను టచ్ చేసింది. పేషెంట్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలుగుతాను.. అనిపించి ఇదే సర్వీస్‌ను ఎంచుకున్నాను.
మనసును తడిచేసిన జ్ఞాపకాలు..
ఈ నర్సింగ్ సేవలో ఎంతో కఠినమైన జబ్బులతో బాధపడేవారిని చూస్తుంటాం. క్యాన్సర్ పేషంట్ల చివరి దశ చాలా కష్టంగా ఉంటుంది. ఒక మహిళా రోగికి యోని క్యాన్సర్ వచ్చింది. ఆ పుండు వల్ల చాలా దుర్వాసన ఉండేది. వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉండేవాళ్లు కాదు. అప్పుడు నేను నాలుగు నెలల గర్భవతిని. మార్నింగ్ సిక్‌నెస్ ఉండేది. ఆ స్మెల్‌కు తల తిరిగిపోయేది. పొట్టలో వికారంగా అనిపించేది. కానీ, డ్రెస్సింగ్ చేస్తేనే ఆమెకు చాలా ఉపశమనం ఉంటుంది. ఆ టైమ్‌లో కూడా రోజూ ఇంజక్షన్ చేసి, పుండును వాష్ చేయడం, అయిట్‌మెంట్ అప్లై చేయడం చేసేదాన్ని. ఆమె కళ్ల నీళ్లు పెట్టుకునేది. ‘నా భర్తతో సహా మా ఇంట్లో వాళ్లు ఎవ్వరూ కనీసం దగ్గరగా వచ్చి కూర్చొని, పలకరించేవాళ్లు లేరు. వచ్చినా చేతులకు గ్లౌజులు వేసుకొని, ముక్కుకు క్లాత్ పెట్టుకొని వస్తున్నారు. ఈ స్థితిలో కూడా నన్ను టచ్ చేసి, నువ్వు ఇంత సేవ చేస్తున్నావు.. ఏమివ్వగలను నీకు.. ’ అనేది. తను చనిపోయేంతవరకు నేను ఒక్కరోజు ఆమె వద్దకు వెళ్లకపోయినా అందరినీ అడిగేవారు. ఇలాంటివి ఎన్నో మనసును తడి చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి ఈ పదేళ్లలో.
రోగి కోలుకోవడంలో నర్స్ పాత్ర కీలకం
ఖమ్మం దగ్గర పాసర్లపాడు అనే పల్లెటూరు మాది. మా నాన్న విశ్రాంత రైల్వే ఉద్యోగి. నా అసలు పేరు జాజుల వెంకటరమణ. కానీ, అందరూ చిన్నప్పటి నుంచి మైరూన్ అనే పిలుస్తారు. టెన్త్‌క్లాస్ తర్వాత నర్సింగ్ కోర్సు చేస్తే త్వరగా జాబ్ వస్తుంది అని చెప్పేవారు. కానీ, నాకు అప్పుడు నర్సింగ్ అంటే ఏమిటో తెలియదు. టెన్త్ తర్వాత నర్సింగ్ గురించి అన్నీ కనుక్కున్నా. డాక్టర్ చికిత్స చేస్తారు. తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడంలో నర్స్ పాత్ర చాలా కీలకం. ఇంజక్షన్స్ చేయడం, సమయానికి మందులు ఇవ్వడం, ధైర్యం చెప్పడం.. ఇవన్నీ పేషంట్ ఆందోళన, బాధ తగ్గిస్తాయి. అందువల్ల ఇది బాగుందనిపించి విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరాను.
చంటి బిడ్డతో.. సేవ
పదేళ్ల క్రితం రెండేళ్ల పాటు పెద్ద హాస్పిటల్స్‌లో ఐసీయూలో వర్క్ చేశా. కానీ, అక్కడ వర్క్ సంతృప్తినివ్వలేదు. స్నేహితుల ద్వారా పాలియేటివ్ కేర్ సెంటర్స్ గురించి తెలిసింది. అంటే మరణానికి చివరి దశలో ఉన్న పేషెంట్స్. ఆ సమయంలో వారి బాధ ఎంత ఉంటుందో చెప్పలేం. అప్పుడే వారికి మానవ స్పర్శ కావాలి. అందుకే అది నా మనసుకు దగ్గరగా ఉన్న వర్క్ అనిపించింది. దీంతో పదేళ్లుగా ఇదే సర్వీస్‌లో ఉన్నాను. హోమ్ విజిట్స్‌కు కూడా వెళ్లేదాన్ని. కరోనా సమయంలో నేను చంటిబిడ్డ తల్లిని. బిడ్డకు పాలు ఇస్తూ కూడా ఈ సర్వీస్ చేశా. పదేళ్లు ‘స్పర్శ్ హాస్పిస్’లో చేశాను. మూడు నెలల నుంచి‘పావనీ ప్రకాశ్ హాస్పిస్’లో సర్వీస్ చేస్తున్నాను.
కుటుంబమూ అత్యంత ముఖ్యమే..
చాలామంది ‘లేడీస్ ఇంట్లోనే ఉంటారు కదా! వారేం చేస్తారులే’ అని అనుకుంటారు. అది నిజం కాదు. మహిళ లేకపోతే ఏమీ లేనట్టే. ఆమె ఉంటే అన్నీ ఉన్నట్టే. దేనినైనా మహిళ ఒంటరిగా సాధించగలదు. నా లైఫ్‌లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక దశలో నాకు, మా హజ్బెండ్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ‘విడిపోదాం’ అన్నారు. మా పేరెంట్స్‌తో సహా నాకు సపోర్ట్‌గా ఎవరూ నిలబడలేదు. ఏమైనా చెబితే ‘వదిలేయ్, వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా’ అనేవారు. కానీ, అది నాకు సరికాదు అనిపించింది. నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు తండ్రి ఉండాలి అని చాలా ఫైట్ చేశాను. నా భర్తది ప్రైవేట్ జాబ్. ఈ రోజు మేం కలిసి హ్యాపీగా ఉంటున్నాం. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. మనసుకు నచ్చిన ఉద్యోగం, సంతోషకరమైన కుటుంబం.. ఇవి నేను సాధించుకున్నాను.
మనకేం కావాలో ఒక క్లారిటీ ఉంటే, దానిని తప్పక అదీ ఒంటరిగానే సాధించుకోగలం. సపోర్ట్ కోరుకుంటేనే గానీ మనం అనుకున్నది సాధించుకోలేం అనిపిస్తుంది నాకు. అప్పుడు అలా మాట్లాడిన మా పేరెంట్స్‌కూడా ఇప్పుడు మమ్మల్ని చూసి, మంచి పని చేశావు అని అభినందిస్తారు. అందుకే, మనకు మనమే పెద్ద సపోర్ట్‌గా ఉండాలి’’ అని వివరించింది బంధాలను, సేవను శ్వాసగా భావిస్తున్న మైరూన్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


