న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్‌కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్‌లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.
మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్‌తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్‌లో బంగ్లాదేశ్‌కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్‌లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.
ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్‌మాల్!


