కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. ఎన్నికల డేటాలో కనిపించిన ఒక ఆశ్చర్యకర అంశం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘సర్’ తొలి నివేదికల్లో 2,208 పోలింగ్ బూత్‌లలో మరణాలు, తప్పిపోయిన, పునరావాసం పొందిన లేదా నకిలీ ఓటర్లు లేరని తేలింది. ఆయా బూత్‌లలోని ఓటర్ల జాబితా గత రెండు దశాబ్దాలుగా ‘పరిశుభ్రంగా’ ఉందని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ)లు నివేదించడం అందరినీ కంగుతినేలా చేస్తోంది. అయితే ఈ డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లాల నుండి వివరణాత్మక నివేదికలు కోరింది. ఆ విచారణ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఈ 'క్లీన్ బూత్‌ల' సంఖ్య 2,208 నుంచి కేవలం 480కి భారీగా తగ్గింది.
ఈ డేటా మార్పుపై తలెత్తిన ప్రశ్నలు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. కేవలం ఒకే రోజులో 1,728 బూత్‌ల డేటాలో మార్పు రావడాన్ని బీజేపీ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. ‘2,200కు పైగా బూత్‌లలో ఎవరూ చనిపోలేదని చెప్పడం మాయాజాలమా? ఈసీ నివేదిక కోరగానే అకస్మాత్తుగా 480 బూత్‌లకు తగ్గించడం బెంగాల్‌లో మాత్రమే జరుగుతుంది’ అంటూ ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా వర్గాలు నిరంతర డేటా నవీకరణల వల్లే ఈ తేడా వచ్చిందని చెబుతున్నా, ఈ అసాధారణ తగ్గింపు వెనుక వాస్తవ కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త జాబితాలో అత్యధిక సంఖ్యలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రేదిఘి (66), కుల్పి (58), మాగ్రహత్ (15), పథర్ప్రతిమ (20) బూత్‌లు ఉన్నట్టు ఈసీవర్గాలు తెలిపాయి.
మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ తరహా ధృవీకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రత్యేక జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో పెండింగ్‌లో ఉన్న అత్యధిక కేసులు ‘సంతాన మ్యాపింగ్’కు సంబంధించినవి. అంటే తల్లిదండ్రులు లేదా తాతామామల ద్వారా ఓటరు ధృవీకరణ జరగాల్సి ఉంది. ప్రత్యేకించి 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని ఓటర్లు తిరిగి ధృవీకరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఓటర్ల జాబితాలో తప్పులను తగ్గించడానికి కమిషన్ తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగమని తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి, మొత్తం 46.20 లక్షల గణన ఫారమ్‌లు దాఖలయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే, 22.28 లక్షల మంది మరణించిన ఓటర్లు కాగా, 6.41 లక్షల మంది తప్పిపోయిన ఓటర్లు, 16.22 లక్షల మందిని తరలించడం జరిగింది. 1.05 లక్షల డబుల్ ఎంట్రీలు గుర్తించారు. జిల్లాల వారీగా మరణించిన ఓటర్ల శాతంపై నివేదిక కూడా ఆసక్తికరంగా ఉంది: కోల్‌కతా నార్త్ 6.91%తో అత్యధికంగా ఉండగా, తూర్పు మెదినీపూర్ 1.4%తో అత్యల్పంగా ఉంది. ఈ లెక్కలు ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు పేరుకుపోయాయని సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!


