
కోల్‌కతా: రాష్ట్రంలో సంభవించిన వరదలకు, ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లో తలెత్తిన దుర్భర పరిస్థితులకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (వీడీవీసీ) కారణమంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదలను ఆమె మానవ నిర్మిత విపత్తుగా అభివర్ణించారు.
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎటువంటి సమన్వయం లేకుండా రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడమే ఈ పరిస్థితికి కారణమని మమతా ఆరోపించారు. శనివారం నుంచి నమోదవుతున్న రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న డార్జిలింగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో డీవీసీ చేపట్టిన చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ. ఐదు లక్షల పరిహారం, ఒకరికి హోమ్‌గార్డ్ ఉద్యోగం ప్రకటించారు. డబ్బుతో ప్రాణ నష్టాన్ని పూడ్చలేమని, అయితే ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాగ్డోగ్రాకు బయలుదేరే ముందు కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన మమతా బెనర్జీ డీవీసీపై పలు ఆరోపణలు చేశారు. జార్ఖండ్‌ను వరదల నుంచి రక్షించేందుకు డీవీసీ మైథాన్,పాంచెట్ రిజర్వాయర్ల నుంచి ఇష్టం వచ్చినట్లుగా నీటిని విడుదల చేసిందని, ఇది దిగువ ప్రాంతమైన బెంగాల్‌లో పరిస్థితిని మరింత దారుణంగా మార్చిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేవలం 12 గంటల్లో 300 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని. దీని కారణంగా హైవేలు, వంతెనలు, ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు.
VIDEO | North Bengal floods: West Bengal CM Mamata Banerjee says, "All tourists have been rescued, except for one missing at Diamond Harbour. Today, 500 tourists are being brought in, while many were brought by buses yesterday. 250 tourists will be accommodated in Siliguri."… pic.twitter.com/dp00WJ6pzd
— Press Trust of India (@PTI_News) October 6, 2025
కాగా డార్జిలింగ్‌లోని మిరిక్, సుఖియాపోఖ్రి, జోరెబంగ్లో, అలాగే జల్‌పాయ్‌గురి జిల్లాలోని నాగర్‌కట వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ఇప్పటివరకు ఉత్తర బెంగాల్ వరదలలో 23 మంది మృతి చెందారని మమత తెలిపారు. డార్జిలింగ్, మిరిక్, కాలింపాంగ్‌లలో 18 మంది, నాగర్‌కటలో ఐదుగురు మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. కాగా వరద ప్రభావిత జిల్లాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 45 బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 500 మంది పర్యాటకులను తరలించామని, మరో 250 మందికి సిలిగురిలో వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. డైమండ్ హార్బర్ నుండి తప్పిపోయిన ఒక వ్యక్తి మినహా మిగిలిన పర్యాటకులందరినీ రక్షించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. చిక్కుకుపోయిన పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని, గదులు ఖాళీ చేయమని ఒత్తిడి చేయవద్దని హోటళ్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఖర్చులను తామే భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది.