న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) ఘన విజయం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటను బద్దలు కొట్టడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నదని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ తన అభినందన ప్రసంగంలో బిహార్ నుండి పారే గంగా నది మాదిరిగానే, బీజేపీ విజయం బెంగాల్‌కు కూడా విస్తరిస్తుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా బెంగాల్‌తో సహా మరికొన్ని రాష్ట్రాలలో సొంత ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడే బీజేపీ ఎదుగుదల పరిపూర్ణమవుతుందని గతంలోనే పేర్కొన్నారు.
సంస్థాగత బలోపేతం
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. బెంగాల్‌లోని మొత్తం 91,000 బూత్‌లలో, బీజేపీ ఇప్పటికే సుమారు 70,000 బూత్‌లలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇది బూత్-స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పునాదిగా పనిచేస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు అప్పగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.
‘రివిజన్’ పూర్తయ్యాక..
బెంగాల్‌లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కసరత్తు పూర్తయ్యే వరకు వేచివుండాలని బీజేపీ యోచిస్తోంది. బీహార్‌లో మాదిరిగానే పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మరణించిన ఓటర్ల తొలగింపు జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. గతంలో వామపక్షాలు శాస్త్రీయ రిగ్గింగ్ ద్వారా జాబితాలోని ఉన్న చనిపోయిన ఓటర్ల తరపున తమ కార్యకర్తలతో ఓటు వేయించి ఎన్నికలను గెలిచేవారని, అయితే ఎస్‌ఐఆర్ తర్వాత ఇది గణనీయంగా తగ్గుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ నేతలు బూత్ స్థాయి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.
తృణమూల్ ఉచ్చులో పడకుండా..
రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం, రాష్ట్ర యూనిట్‌లో క్రమశిక్షణను కాపాడటం ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర నేతలను అనవసరమైన వాక్చాతుర్యాన్ని మానుకోవాలని, ప్రజలను ఆక్టటుకునేందుకు సొంత కథనాలను సృష్టించే తృణమూల్ ఉచ్చులో పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారాన్ని సాగించి, ఐక్యతా సందేశాన్ని పంపాలని పార్టీ యోచిస్తోంది. సమిష్టి నాయకత్వం, ప్రధాని మోదీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం.
క్షీణిస్తున్న శాంతిభద్రతలను హైలెట్ చేస్తూ..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేవనెత్తాలనుకుంటున్న అతిపెద్ద సమస్య మహిళల భద్రత. మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నాయని, ఆర్‌జీ కర్ ఘటన, దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ప్రధాన సమస్యలుగా బీజేపీ నేతలు హైలైట్ చేయనున్నారు. పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి లేమి, వలసలు పేదరికం, ఆర్థిక అస్థిరత మొదలైనవాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. టీఎంసీ అందిస్తున్న ‘లక్ష్మీ భండార్’ పథకానికి బదులుగా పశ్చిమ బెంగాల్‌లోని 1.5 కోట్ల మహిళలకు మహిళల ఉపాధికి రూ. 10,000 అందించాలని ఎన్‌డీఏ నిర్ణయించిందని తెలుస్తోంది.
టార్గెట్ ‘160’
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఇక్కడి వంశవాద రాజకీయాలు, అవినీతిని లక్ష్యంగా చేసుకోనుంది. ముస్లింలను సంతృప్తి పరచడం లాంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టడం బీజేపీ దగ్గరున్న మరొక వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో బీజేపీ నేతలు గెలిచిన 120 అసెంబ్లీ సీట్లు ఇప్పటికే ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సీట్లతో పాటు అదనంగా మరో 40 నుంచి 50 సీట్లపై కేంద్రీకరించి 160 సీట్ల లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ కృషి చేస్తోందని సమాచారం.
ఇది కూడా చదవండి: ‘చనిపోలేదు.. ఇప్పుడే పుట్టింది’.. ‘జన్ సురాజ్’పై పోస్ట్‌మార్టం


