మన మూలమే బలం | Telangana Woman yYara Anita Reddy Contests Australian MP Elections | Sakshi
Sakshi News home page

మన మూలమే బలం

Jan 3 2026 12:52 AM | Updated on Jan 3 2026 12:52 AM

Telangana Woman yYara Anita Reddy Contests Australian MP Elections

స్త్రీ శక్తి

‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు.  అలా అని మన మూలాలను మరచి పోనక్కర లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలే మన బలం. తెలంగాణ బిడ్డ అనితారెడ్డి భర్తతోపాటు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తన ప్రాంతీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే రాజకీయ రంగంలో అడుగు పెట్టింది. వాక్చాతుర్యం, సామాజిక సేవ, రాజకీయాలపై ఆమెకు ఉన్నఅవగాహనను పరిగణనలోకి తీసుకున్న లిబరల్‌ పార్టీ త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అనితారెడ్డి సౌత్‌ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా బరిలో దిగనుంది.

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన అనితారెడ్డి అడిలైడ్‌లోని క్లెమ్‌జింగ్‌లో భర్తతో పాటు నివసిస్తోంది. ఎంబీఏ చేసిన అనితకు సీనియర్‌ మేనేజర్‌గా ప్రైవేట్‌ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఆమె భర్త ఆదిరెడ్డి యారా అక్కడ మల్టీకల్చరల్‌ కమ్యూనిటీ లీడర్‌. తన అత్తగారి ఊరైన హనుమకొండ జిల్లా రామకృష్ణాపూర్‌కు వచ్చిన అనితారెడ్డి యారాని ‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

ఏ ఇలా మొదలైంది...
‘‘మేము 2006లో ఆస్ట్రేలియా వెళ్లాం. అడిలైడ్‌లో మా జీవితాన్ని ప్రారంభించాం. ఆ టైమ్‌లో అక్కడ భారతీయ జనాభా చాలా తక్కువ. 2007 ‘ఇండియన్  మేళా’ ఏర్పాటు చేశాం. తెలుగు అసోసియేషన్  (తాసా) ఏర్పాటు చేయాలనుకున్న రాజ్‌కిరణ్‌ అక్కడ మాకు పరిచయమయ్యారు. ఆయనతో పాటు మరో మూడునాలుగు కుటుంబాల వారితో పరిచయం అయింది. వారు తెలుగు అసోసియేషన్  పెడదామనే ఆలోచనలో ఉన్నారు. అసోసియేషన్‌ ఏర్పాటు అయ్యాక మా ఆయన కమిటీ మెంబర్‌గా చేరారు. తను ‘ఇండియన్  అసోసియేషన్ ’ ప్రెసిడెంట్‌ అయ్యాక పూర్తి సమయం కమ్యూనిటీ సర్వీస్‌లోనే ఉండేవారు. ఆ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి.

ఏ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో తొలిసారిగా బతుకమ్మ!
తెలుగు వాళ్లమంతా మన పండుగలు ముఖ్యంగా బతుకమ్మ, దసరా, సంక్రాంతి జరుపుకునేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్ ’ ఏర్పాటు చేశాం. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగలపై బాగా దృష్టి పెట్టాను. 2020లో ‘అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్‌’కు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. ఆ టైమ్‌లో పార్లమెంట్‌లో బతుకమ్మ ఆడాలన్న నా ప్రతిపాదనను మల్టీ కల్చరల్‌ మినిస్టర్‌ జోయ్‌ బెడిసన్  అంగీకరించారు.  ఆ రకంగా ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మొదటిసారి బతుకమ్మ ఆడింది మేమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుతోంది. సాధారణంగా పార్లమెంట్‌లోకి ఎవరినీ అనుమతించరు. కానీ, ఇప్పుడు దాదాపు 200 మంది మహిళలకు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీపావళి పండుగ రోజుల్లో ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ దీపతోరణాలతో వెలిగిపోతుంది.  

రాజకీయాల్లోకి తొలి అడుగు
అక్కడి తెలుగువాళ్లందరికీ ఏ సమస్య ఉన్నా మా ఇంటికే రావడం అలవాటు. అసోసియేషన్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాం. 2011 నుంచి లిబరల్‌ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉంటున్నాం. 2021లో లిబరల్‌ పార్టీలో టోరెన్ ్స బ్రాంచ్‌ సభ్యత్వం తీసుకున్నాను. ఆ తరువాత టోరెన్ ్స ఎస్‌ఈసీ, బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. ప్రస్తుతం రెండోవిడత ఆ పదవిలో కొనసాగుతున్నాను. 2022లో క్లెమ్‌జింగ్‌ వార్డ్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పుడు అనిపించింది... ఇంతవరకు వచ్చాం. మళ్లీ ఎందుకు పోటీ చేయకూడదు అని. అప్పుడే ఎంపీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాను. టికెట్‌ ప్రకటనకు ముందు మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. గెలిస్తే ఏమి చేస్తావు? ఓడిపోతే ఎలా ఉంటావు? – మొదలైన ప్రశ్నలకు నిక్కచ్చిగా జవాబులు ఇచ్చాను. మార్చి 18న ఎన్నికలు జరగనున్నాయి.

ఏ గెలిస్తే... ఇలా..
యువత, మహిళా సాధికారత, నిరుద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతాను. లిబరల్‌ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాను. సమాజానికి మేలు చేసే అంశాలపై అసెంబీల్లో మంచి నిర్ణయాలు తీసుకునే విధానాలకు మద్దతు ఇస్తాను. ప్రజల గొంతుగా ఉంటాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను’’ అని చెప్పారు అనితారెడ్డి.

– వర్ధెల్లి లింగయ్య, సాక్షి, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement