గన్‌పార్క్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్, తలసాని, సబిత తదితరులు
సమావేశాలు ముగిసేవరకు అసెంబ్లీకి దూరం
శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేల భేటీ.. అధినేతతో సంప్రదింపులు
స్పీకర్ ఏకపక్ష వైఖరి, సీఎం అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి మొత్తం సమావేశాల బాయ్‌కాట్‌కు నిర్ణయం
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ గన్‌పార్కుకు.. అమర వీరుల స్తూపం వద్ద ఆందోళన
మూసీ కన్నా ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలన్న మాజీ మంత్రి హరీశ్‌రావు
నేడు బీఆర్‌ఎస్ భవిష్యత్ కార్యాచరణ వెల్లడి..
నదీ జలాలపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్‌లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
సభలో జరిగిన పరిణామాలను ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రస్తుత సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీని బహిష్కరించడమే సరైనదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. పార్టీలకతీతంగా సభ్యుల హక్కులను రక్షించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. స్పీకర్ వైఖరితోపాటు ప్రభుత్వ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. సుమారు గంట పాటు నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్‌ఎస్ బహిష్కరిస్తున్నట్లు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు.
అసలేం జరిగింది..
ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై చర్చ సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నడుమ మాటల యుద్ధం నడిచింది. మూసీ సుందరీకరణ కోసం చేసే ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇళ్ల కూలి్చవేతలు, నిర్వాసితులకు పరిహారం, ప్రాజెక్టు అంచనాలు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంటకు పైగా మాట్లాడారు. అయితే సీఎం ప్రసంగంపై వివరణ కోరేందుకు తాము అడిగినా ఎంఐఎంకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్ తప్పు పట్టింది.
హరీశ్‌రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ స్పీకర్ సభకు కస్టోడియన్‌గా తమ హక్కులు కాపాడాలని కోరారు. తమ గొంతు నొక్కుతూ హక్కులకు భంగం కలుగుతున్నపుడు స్పీకర్‌కు తమకు రక్షణగా నిలవాలన్నారు. ఈ దశలో హరీశ్‌రావు మైక్‌ను కట్ చేసిన స్పీకర్.. మంత్రి శ్రీధర్‌బాబుకు అవకాశం ఇచ్చారు. శ్రీధర్‌బాబు వివరణతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. సభా సాంప్రదాయాలు కాపాడుతూ హరీశ్‌రావుకు మైక్ ఇవ్వాలని ఆయన కోరారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు కూడా సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన తెలపడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంది..’ అనడంతో స్పీకర్ మరోమారు మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
ఏడు సమావేశాల్లో ఇదే తొలిసారి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్‌లో కొలువుదీరిన మూడో శాసనసభ ఇప్పటివరకు ఏడు మార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్‌ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా..మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా శనివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే భేటీలో బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. నదీజలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
రేవంత్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు: హరీశ్‌రావు
గన్‌పార్కు వద్ద మాట్లాడిన హరీశ్‌రావు.. మూసీ ప్రక్షాళనకు ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. మూసీ కాలుష్యం కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందన్నారు. ‘రాహుల్‌గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశంలో మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం. కానీ సభలో ప్రవేశపెట్టిన మినట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు.
స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారు. సీఎంను విమర్శించొద్దంటూ స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి? ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక సీఎంలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్‌పై సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినీతికి అధికారికంగా రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్న రేవంత్‌కు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీని గాం«దీభవన్‌లా నడిపిస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందని, స్పీకర్ మౌనంగా ఉంటూ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.


