న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు కొలువుదీరబోతోంది. అయితే ఇంతలో ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు తమను తాము విశ్లేషించుకోవడం మొదలుపెట్టాయి. ఈ కోవలోనిదే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’.
గణాంకాలతో సమాధానం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ ‘జన్ సురాజ్’ తన రాజకీయ పయనానికి శుభారంభం పలికిందని ‘ఇండియా టుడే’ తన విశ్లేషణలో పేర్కొంది. అత్యంత క్లిష్టమైన బిహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఈ పార్టీ చనిపోయిందంటూ అంటున్నవారికి, ఎన్నికల గణాంకాలు గట్టి సమాధానం ఇస్తున్నాయని వివరించింది. సున్నా సీట్లు గెలుచుకున్నప్పటికీ, పార్టీ సాధించిన బలమైన 3.4% ఓట్ల వాటాను విశ్లేషకులు ఒక ముఖ్యమైన పునాదిగా చూస్తున్నారు. ఇది బీహార్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న బీఎస్పీ, ఏఐఎంఐఎం, మరో మూడు వామపక్ష పార్టీల సంయుక్త ఓట్ల వాటా కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు సంప్రదాయ రాజకీయాలను ధిక్కరిస్తూ, ప్రజా సమస్యలపై ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రయత్నానికి కనీస ఆమోదం లభించిందని స్పష్టం చేస్తున్నాయి.
‘కాంస్య పతక విజేత’గా..
జన్ సురాజ్ అరంగేట్రాన్ని లోతుగా పరిశీలిస్తే, పార్టీ ప్రభావం కేవలం ఓట్ల వాటాకే పరిమితం కాలేదని తెలుస్తోంది. పార్టీ పోటీ చేసిన 238 స్థానాల్లో దాదాపు 54% అంటే 129 నియోజకవర్గాల్లో ఇది మూడవ స్థానంలో నిలిచి ‘కాంస్య పతక విజేత’గా అవతరించింది. సరన్ జిల్లాలోని మార్హౌరా అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి 58,190 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సగటున ప్రతి సీటుకు 7,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. అయితే 238 మంది అభ్యర్థులలో 236 మంది డిపాజిట్లు కోల్పోయారనేది నిజమే అయినా, చన్పాటియా, సహర్సా తదితర 33 నియోజకవర్గాల్లో ‘జన్ సురాజ్’ ఓట్ల సంఖ్య ఎన్డీఏ లేదా మహాఘట్‌బంధన్ గెలుపు ఆధిక్యాన్ని మించిపోయి, ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందనడంలో సందేహం లేదని ‘ఇండియా టుడే’ పేర్కొంది.
ఆదర్శవాద రాజకీయం..
మరోవైపు ప్రశాంత్ కిషోర్ అనుసరించిన ఆదర్శవాద రాజకీయ విధానం సీట్ల రూపంలోకి మారకపోయినా, ఈ అంశాలు ప్రజలకు చేరాయి. రాష్టంలోని నిరుద్యోగం, వలసలు, విద్య, ఆరోగ్యం తదితర సమస్యలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి సారించారు. అంతేకాకుండా నేర చరిత్ర లేని అధికారులు, విద్యావేత్తలు, వైద్యులు, సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టిన ఏకైక పార్టీగా ‘జన్ సురాజ్’ నిలిచింది. కులం, మతం తదితర అంశాల అధారంగా ఓటింగ్ జరిగే రాష్ట్రంలో కొత్త పార్టీ తన మొదటి ప్రయత్నంలో విజయాన్ని సాధించలేకపోయింది.
వెబ్‌సైట్‌లో దక్కిని స్థానం?
అయితే ఎన్నికల సంఘం (ఈసీఐ)వెబ్‌సైట్‌లో జన్ సురాజ్ సాధించిన 3.4% ఓట్ల వాటాను ప్రత్యేకంగా చూపించకపోవడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 0.3% ఓట్లు సాధించిన పార్టీల పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ, జన్ సురాజ్ మాత్రం ‘ఇతరులు’ వర్గంలోకి నెట్టివేయడం ఆశ్చర్యం కలిగించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్య సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. జన్ సురాజ్ పార్టీ మొత్తం 16.77 లక్షలకు పైగా ఓట్లను సాధించింది. ఇది బీహార్‌లోని ఓటర్లలో గణనీయమైన సంఖ్య.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు
ఈ ఎన్నికల అగ్నిపరీక్ష ‘జన్ సురాజ్’ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది. పాదయాత్రలు, వివిధ సమస్యాత్మక అంశాల ఆధారిత ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. సంప్రదాయ రాజకీయ శక్తుల ఓటు బ్యాంకును చీల్చగల సామర్థ్యాన్ని పార్టీ ప్రదర్శించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ చూపిన తొలి ప్రదర్శన.. భవిష్యత్తులో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ యూటర్న్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై కొత్త ప్రకటన


