ఏ దేశానికి చెందిన ప్రజలైనా ఆ దేశం అందించే హక్కులపైన ఆధారపడే స్వేచ్ఛగా జీవించగలుగుతారు. ఇటువంటి స్వేచ్ఛ దేశప్రజల సమగ్రాభివృద్ధికి దోహపడుతుంది. నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం(డిసెంబర్ 10). నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్,ఐస్లాండ్‌లు మానవ హక్కుల పరిరక్షణ విషయంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాయని అనేక నివేదికలు చెబుతున్నాయి.
ఈ దేశాలను నార్దిక్ దేశాలు అని అంటారు. వీటిలోని స్వీడన్ అయితే.. బిడ్డ పుట్టిన సందర్భంలో ఆ తల్లిదండ్రులకు ఏకంగా ఏడాదన్నర సెలవు తీసుకునే అవకాశం కల్పించింది. నార్దిక్ దేశాలు పౌర, రాజకీయ, సామాజిక హక్కుల సార్వత్రిక రక్షణను ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ సూచికలలో స్థిరంగా అగ్రస్థానంలో నిలిచాయి.
నార్వే: లింగ సమానత్వంలో ముందు చూపు
పౌర స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి నార్వే ప్రాధాన్యతనిస్తుంది. బలమైన పౌర హక్కులతో పాటు, నార్వే ఒక ముఖ్యమైన చట్టాన్ని అమలు చేసింది. కార్పొరేట్ బోర్డు సీట్లలో మహిళలకు కనీసం 40 శాతం కేటాయించేలా కోటాను అమలు చేస్తోంది. ఇది ఉద్యోగ రంగంలో సమానత్వాన్ని పెంచడమే కాకుండా, నిర్ణయాధికార స్థానాలలో సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
స్వీడన్: కుటుంబ సంక్షేమం- సమానత్వం
మానవ హక్కుల కల్పనలో స్వీడన్ ముందుంటుంది. పేరెంట్ లీవ్ విధానమే దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. బ్రిటన్ దంపతులు ఎవరైనా తమ ఇంట బిడ్డ పుట్టినప్పుడు ఏకంగా 480 రోజులు (సుమారు ఏడాదిన్నర) జీతం చెల్లింపుతో కూడిన సెలవు తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులిద్దరూ తప్పనిసరిగా సెలవులను పంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం కుటుంబంలో బాధ్యతను సమానంగా పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా స్త్రీలు తమ వృత్తి జీవితాన్ని కొనసాగించడానికి వీలు కలుగుతుంది.
డెన్మార్క్: పాలనలో పారదర్శకత
పాలనలో అత్యున్నత స్థాయి పారదర్శకతకు డెన్మార్క్ ప్రశంసలు అందుకుంటోంది. దేశంలోని ఓపెన్ బడ్జెట్ వ్యవస్థ పౌరులు ప్రభుత్వ ఖర్చులను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి అనుమతి కల్పిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై పూర్తి పారదర్శకతను అందించడం ద్వారా, అవినీతి స్థాయిలను తగ్గించడంలో డెన్మార్క్ ముందుంది.
ఫిన్లాండ్: విద్య- సామాజిక సంక్షేమం
మానవ హక్కుల విధానంలో విద్య , సామాజిక సంక్షేమంపై ఫిన్లాండ్ దృష్టి పెట్టింది. విద్యలో ఆర్థిక అసమానతలకు తావు లేకుండా, చిన్నారులకు పాఠశాల్లో ఉచిత భోజనాన్ని అందిస్తుంది. ఈ విధానం పిల్లలందరికీ వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. ఇది పోషణ , సమాన విద్యా అవకాశాలను అందించి, సామాజిక సమగ్రతను, బాలల హక్కులను బలోపేతం చేస్తుంది.
ఐస్లాండ్: వేతన అసమానతపై పోరాటం
సమాన వేతనం విషయంలో ప్రపంచానికే ఐస్లాండ్ ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో సమాన వేతన చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పురుషులు, మహిళలు సమానంగా వేతనం పొందుతున్నారని కంపెనీలు చట్టబద్ధంగా నిరూపించాల్సి ఉంటుంది. ఈ చట్టం లింగ వేతన వ్యత్యాసాన్ని అంతం చేయడానికి రూపొందింది. ఆర్థిక హక్కులలో లింగ సమానత్వం పోరాడుతున్న వారికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. నార్డిక్ దేశాలు ఈ మానవ హక్కుల దినోత్సవం నాడు పలు దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు


