అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2025: దివ్యాంగులు.. అద్భుతమైన శక్తికి, అసమానమైన దృఢత్వానికి, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. భౌతిక అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ, ధృఢ సంకల్పానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. కళలు, క్రీడలు, సైన్స్, సాంకేతికతతో సహా జీవితంలోని ప్రతి రంగంలో వారు సాధిస్తున్న అద్భుత విజయాలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. తమకున్న వైకల్యం కారణంగా ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుండి చూస్తూ, విజయాలు సాధిస్తున్న దివ్యాంగులు మనకెందరో కనిపిస్తారు. సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించే ఉద్దేశ్యంతో ప్రతీయేటా డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల హక్కులు, గౌరవం, సంక్షేమంపై దృష్టి సారించే కీలకమైన వార్షిక వేడుకే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities - IDPD). 1992 నుండి ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఈ దినోత్సవం.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో దివ్యాంగుల సంపూర్ణ భాగస్వామ్య ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మంది (15%) ఏదో ఒక వైకల్యంతో జీవిస్తున్నారు.
2025లో ఐడీపీడీ థీమ్ ‘సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు.. దివ్యాంగులను కలుపుకుని వెళ్లే సమాజాలను పెంపొందించడం’. ఈ థీమ్‌ను రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలు ఎంపిక చేశారు. ఈ లక్ష్యం కేవలం అవగాహనకే పరిమితం కాకుండా, కార్యాచరణకు ప్రాధాన్యత ఇస్తుంది. 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండాలో వైకల్యాన్ని చేర్చడాన్ని ఈ థీమ్ ప్రోత్సహిస్తుంది. దివ్యాంగుల దినోత్సవం వేళ తమ సంకల్ప బలంతో వైకల్యాన్ని జయించిన దివ్యాంగుల విజయగాథలు కొన్ని గుర్తు చేసుకుందాం.

స్టీఫెన్ హాకింగ్ (యునైటెడ్ కింగ్‌డమ్)
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన స్టీఫెన్ హాకింగ్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) అనే వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయితే విశ్వ రహస్యాలను ఛేదించిన ప్రపంచ ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త , కాస్మోలజిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన ‘A Brief History of Time’ వంటి పుస్తకాల ద్వారా బ్లాక్ హోల్స్, సమయం గురించి విప్లవాత్మక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదని నిరూపించిన మహనీయుడు స్టీఫెన్ హాకింగ్.

హెలెన్ కెల్లర్ (అమెరికా)
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన హెలెన్ కెల్లర్, చిన్నతనంలో అంధత్వంతో పాటు చెవుడును ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె పట్టుదలతో చదువుకుని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన మొదటి అంధురాలుగా చరిత్ర సృష్టించారు.

ఇరా సింఘాల్ (ఢిల్లీ)
ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్, స్కోలియోసిస్ (వెన్నెముక వైకల్యం) ఉన్నప్పటికీ, యూపీఎస్‌సీ సివిల్స్ పరీక్షలో అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2014లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించారు. అంగవైకల్యం కారణంగా గతంలో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినా, న్యాయ పోరాటం చేసి గెలిచిన ఆమె, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచారు.

దీపా మాలిక్ (హర్యానా)
హర్యానాకు చెందిన దీపా మాలిక్.. గుండెల్లో కణితి కారణంగా నడుము కింద పక్షవాతానికి గురయ్యారు. అయినప్పటికీ ఆమె షాట్‌పుట్, జావెలిన్ త్రో వంటి క్రీడలలో పాల్గొని, పారా ఒలింపిక్స్‌లో పతకం (రజతం) సాధించిన మొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు పద్మశ్రీ , ఖేల్ రత్న అవార్డులు లభించాయి.
సుధా చంద్రన్ (ముంబై/తమిళనాడు)
ముంబై/తమిళనాడు మూలాలున్న సుధా చంద్రన్ రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయారు. అయినా కూడా కృత్రిమ కాలు (Jaipur Foot) సహాయంతో తిరిగి భరతనాట్యం సాధన చేసి గొప్ప నర్తకిగా, నటిగా ఎదిగారు.
మరియప్పన్ తంగవేలు (తమిళనాడు)
తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు, చిన్నతనంలోనే ఒక కాలు వైకల్యానికి గురయ్యారు. అయినప్పటికీ పట్టుదలతో పారా ఒలింపిక్స్ హైజంప్‌లో రాణించి, 2016లో స్వర్ణం, 2020లో రజతం సాధించి భారతదేశ క్రీడారంగానికి కీర్తిని తెచ్చారు.
అమృత్ (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు అమృత్, తీవ్ర శారీరక వైకల్యంతో ఉన్నప్పటికీ, కేవలం రెండు చూపుడు వేళ్ల సాయంతో కంప్యూటర్‌పై పనిచేయడం నేర్చుకుని, అమెజాన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు.
మధు కుమార్ (తెలంగాణ)
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మధు కుమార్, విద్యుదాఘాతంలో రెండు చేతులు, కాళ్లు కోల్పోయారు. అయినప్పటికీ తన సంకల్పంతో పుస్తకాల్లోని పేజీలను నోటితో మార్చుకుంటూ, నోటి సహాయంతో పెన్ను పట్టుకుని రాస్తూ, పదవ తరగతిలో 86% మార్కులు సాధించి. దృఢ సంకల్పశీలిగా నిలిచారు.
మురళీకాంత్ పేట్కర్ (మహారాష్ట్ర)
మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ పేట్కర్, 1965 యుద్ధంలో తీవ్రంగా గాయపడి నడుము కింది భాగం పక్షవాతానికి గురయ్యారు. అయినా స్విమ్మింగ్‌ను ఎంచుకుని, పారా ఒలింపిక్స్‌లో (1972) భారతదేశానికి మొదటి బంగారు పతకం సాధించిన క్రీడాకారునిగా నిలిచారు.
ఇది కూడా చదవండి: ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత!


