బేకర్స్ ఫన్‌లో ఘనంగా బాలల దినోత్సవం
చిన్న పిల్లలతో కప్ కేకులు, మఫిన్స్ తయారీ
దగ్గరుండి చేయించిన సెలబ్రిటీ షెఫ్ సోనాలీ మిత్రా
సాక్షి హైదరాబాద్ : నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని తెల్లాపూర్‌లో గల బేకర్స్ ఫన్‌లో వైవిధ్యంగా వేడుకలు నిర్వహించారు. సెలబ్రిటీ షెఫ్, పలు అంతర్జాతీయ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సోనాలీ మిత్రా ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో మఫిన్లు, కప్ కేక్స్ చేయించారు. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న దాదాపు 40 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వారికి బేకర్స్ ఫన్ యాజమాన్యం బేకింగ్ యాప్రాన్, షెఫ్ క్యాప్ లు అందజేశారు. పిల్లలంతా వాటిని ధరించి ఎంతో సంబరపడ్డారు. సెలబ్రిటీ షెఫ్ సోనాలీ మిత్రా దగ్గరుండి.. మఫిన్లు ఎలా ఫిల్ చేస్తారో, తర్వాత ఎలా బేక్ చేస్తారో చూపించి అనంతరం వారితో అవి తయారు చేయించారు. కప్ కేకులు ఎలా చేస్తారో కూడా దగ్గరుండి చూపించారు. సాధారణంగా ఇళ్లలో తమ తల్లులు చేసిన ఆహారాన్ని తినే పిల్లలు, ఇప్పుడు స్వయంగా తామే అవి తయారు చేయడంతో ఎంతో సంబరపడిపోయారు.

బేకింగ్ యాప్రాన్ వేసుకుని, షెఫ్ క్యాప్ పెట్టుకుని తమ చిన్నిచిన్ని చేతులతో సరదాగా మఫిన్స్, కప్ కేకులు చేశారు. అనంతరం వాటికి క్రీమ్‌తో డెకరేట్ చేయించారు. పిల్లలందరికీ బేకర్స్ ఫన్ వారి ప్రత్యేక గుడీస్ ఇచ్చారు. చివరగా సెలబ్రిటీ షెఫ్ సోనాలీ మిత్రా పిల్లలందరితో కలిసి చిల్డ్రన్స్ డే కేక్ కట్ చేశారు. ఇలా ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది.


